Breaking News

ఫేక్ న్యూస్‌పై టాలీవుడ్‌ ఇలా చేయబోతోందా!?


ఫేక్‌ న్యూస్‌పై టాలీవుడ్ ఏం చేయబోతోంది..? పక్కా ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తోందా..? ఇప్పటికే ఓ ప్రణాళికను పెద్దలు రచించేశారా..? కుర్ర హీరో విజయ్ దేవరకొండతో మొదలైన ఈ వ్యవహారం ఇదివరకు ఎన్నడూ లేని విధంగా.. భవిష్యత్తులో ఫేక్ అనే పదం వినపడకుండానే ఉండాలని పెద్దలు ముందుకెళ్తున్నారా..? ఇందుకు పక్కాగా ఓ పాలసీని తీసుకురాబోతున్నారా..? ఇకపై ఫేక్ న్యూస్ రాస్తే అంతే సంగతులా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. అసలు టాలీవుడ్ పెద్దలు ఏం చేయబోతున్నారు..? పెద్దల మనసులో ఏముంది..? అది ఆచరణలోకి ఎప్పుడొస్తుంది..? అనే విషయాలు www.cinejosh.com అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇన్నాళ్లూ వేరు..!?

ఫేక్ న్యూస్ అనే తంతు ఎప్పట్నుంచో నడుస్తోంది. కొన్ని వెబ్‌సైట్లు పనికట్టుకుని మరీ కొందరు నటీనటులను టార్గెట్ చేస్తూ వార్తలు రాయడం.. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి బ్లాక్ మెయిల్‌ కూడా చేయడం కొత్తేమీ కాదు. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమే. ఇది నాటి నుంచి నేటి వరకూ ఇది నడుస్తూనే ఉంది. అయితే మీడియాను ఎందుకులే గెలకడం అని చూసీ చూడనట్లుగానే నటీనటులు వాళ్ల పని వాళ్లు చూసుకుంటూ ముందుకెళ్తుండేవారు. ఇలాంటివన్నీ పెద్ద పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి ఫ్యామిలీస్‌కు మొదలుకుని ఎలాంటి బ్యాగ్రౌండ్‌లేని వారికీ జరుగుతుండేవి. అయితే అనవసరంగా హాట్ టాపిక్ అవ్వడం ఎందుకు..? మనల్ని మనమే రోడ్డు మీదికి లాక్కున్న వాళ్లం అవుతాం కదా..? అని మిన్నకుండిపోయేవారు.

రోజులు మారాయ్..!

అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లేవ్. రోజులు మారాయ్.. మీడియాపైనే తిరగబడే రోజులొచ్చేశాయ్.. తప్పుచేస్తే ఎంత తోపు అయినా.. మీడియా అయినా ఒక్కటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. ప్రశ్నిద్దాం.. పోరాడుదాం.. ఉద్యమించి తమ సత్తా ఏంటో చూపించాలని విజయ్ దేవరకొండతో మొదలైన ఈ వ్యవహారం టాలీవుడ్ సీనియర్, జూనియర్, స్టార్ హీరోలను కదిలించింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఒక్కటయ్యింది. ఇదే సరైన సమయం ఇక ఉద్యమించాల్సిన టైం వచ్చేసిందని అనుకున్నారేమో కానీ.. నటీనటులంతా దాదాపు ఒక్కటై ఏకథాటికొచ్చేశారు. సరిగ్గా ఇలానే ఉండి పోరాడితే కచ్చితంగా ఫేక్‌ను తరిమేసే అవకాశాలు మెండుగా ఉన్నాయ్.

ఇలా చేయబోతోందా..!?

వాస్తవానికి ఇలా ఫేక్‌పై ఎప్పట్నుంచో ఉద్యమం అనేది నడుస్తోంది. అప్పట్లో కొన్ని యూ ట్యూబ్ చానెల్స్, మరికొన్ని వెబ్‌సైట్స్ తమ ఫొటోలను అసభ్యంగా, అశ్లీలంగా వాడేసుకుంటున్నారని కొందరు నటీమణులు రోడ్డుపైకి వచ్చారు. ఈ వ్యవహారం పోలీసులదాకా వెళ్లింది. చాలానే యూట్యూబ్, వెబ్ సైట్స్‌ మూతపడ్డాయ్ కూడా. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఇది తెరపైకి వచ్చింది. అందుకే ఇకపై ఇలాంటివేమీ జరగకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ఫేక్‌పై ఒక పాలసీ లేదా ఒక చట్టాన్ని తీసుకురావాలని పెద్దలు భావిస్తున్నారట. ఇప్పటికే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని దృష్టికి ఈ వ్యవహారం తీసుకెళ్లినట్లు తెలియవచ్చింది. కచ్చితంగా దీన్ని ఖండిద్దాం.. అవసరమైతే చట్టం తెద్దామని మీరంతా ఒక్కటై ముందుకు రావాలని.. ఇలా ప్రభుత్వంపై కూడా కొన్ని సైట్స్ అర్థం పర్థం లేకుండా రాసేస్తున్నాయని కచ్చితంగా ఫలానా పని చేద్దామంటే కలిసికట్టుగానే చేద్దామని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సపోర్టు ఉంటుందని కూడా మంత్రి హామీ ఇచ్చారట.

శిక్షలు తప్పవ్!

ఈ క్రమంలో చట్టం ప్రకారం ఫేక్ న్యూస్ రాస్తే వారిపై ఎలా శిక్షించాలి..? న్యూస్ రాసినవారి పరిస్థితేంటి..? సదరు వెబ్ సైట్ లేదా యూట్యూబ్ చానెల్ పరిస్థితి ఏంటి..? వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి..? అని దీనిపై పెద్దలు ఓ కమిటీని వేసి అలా ముందుకెళ్లాలని భావిస్తున్నారట. ఇందులో కొందరు సీనియర్ హీరోలతో పాటు దర్శకనిర్మాతలు కూడా ఉంటారట. ఇప్పటికే దీనిపై కొలిక్కి వచ్చిందట. మొత్తానికి చూస్తే ఇకపై ఫేక్ వార్త కనపడితే అంతే సంగతులు అన్న మాట. ఇంకోసారి ఇలాంటి ఫేక్ వార్తలు అంటే రాయడానికే భయపడేలా శిక్షలు విధించాలని అదే విధంగా అవసరమైతే నష్టపరిహారం డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంటుందట. మరి ఇది ఎంతవరకు ఆచరణలోకి వెళ్తుందో వేచి చూడాలి.



By May 10, 2020 at 06:06PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/50977/tollywood.html

No comments