రంగంలోకి దిగిన పెద్దన్న.. ‘ఫేక్’ ఇక పరారే!
టాలీవుడ్‌కు ఇప్పుడు పెద్దన్నలా వ్యవహరించేది.. ప్రతి పనిలో కర్త, కర్మ, క్రియలాగా ఉండేది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అన్న విషయం తెలిసిందే. బయటికి చాలా విషయాలు తెలియకపోయినప్పటికీ చిరు మాత్రం దివికేగిన దర్శకరత్న దాసరి నారాయణ రావు చేపట్టిన ‘పెద్దన్న’ బాధ్యతలను ఎప్పుడో తీసేసుకున్నారనే చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో ఎలాంటి విషయాన్నయినా సరే సామరస్యంగా చర్చించి పరిష్కరించగలిగే వ్యక్తి మెగాస్టార్ మాత్రమే. అందుకే ప్రస్తుతం ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న.. నటీనటులను తెగ ఇబ్బంది పెడుతున్న ‘ఫేక్’పై యావత్ ఇండస్ట్రీ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కుర్ర హీరో విజయ్ దేవరకొండ దీనిపై పెదవి విప్పగా మెగాస్టార్ మొదలుకుని సీనియర్, జూనియర్ స్టార్ హీరోలు కూడా మద్దతిచ్చేశారు.
అయితే.. ఎక్కువ శాతం ఇండస్ట్రీ తరఫున ఏం జరిగినా.. ఏం చేయాలన్నా.. ఎలా ముందుకెళ్లాలనే దానిపై మెగాస్టార్ గుండానే వెళ్లాలని భావిస్తున్నారట. ఇప్పటికే అక్కినేని నాగార్జున లాంటి వారు చిరునే లీడ్ తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగానే కోరారు. ఇలా చాలా మంది పెద్దన్నకు వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేసి మీరే ముందుండి నడిపించాలని.. తాముకూడా ఈ ఫేక్‌కు బాధ్యులమేనని చెప్పారట. అందుకే దీనిపై సునిశితంగా ఆలోచించిన చిరు.. ఓ నిర్ణయానికి వచ్చారట. కరోనా కష్టకాలం నుంచి టాలీవుడ్ కోలుకున్నాక పెద్దలందరితో ఒకసారి సమావేశమై దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి రావాలని అనుకుంటున్నారట.
ఇప్పటికే.. దీనిపై పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి ఓ చట్టం కిందికి దీన్ని తీసుకురావడమా..? లేదా ఏదైనా కొత్త చట్టం తీసుకురావడమా..? అనేది ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇదిగో టాలీవుడ్ ఇలా చేయబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయ్. మరోవైపు మెగాస్టార్ కూడా రంగంలోకి దిగేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఇది వర్కవుట్ అయితే మాత్రం ‘ఫేక్’ పరారవుతుంది.. ఫేక్ న్యూస్ రాయాలంటే వెబ్ సైట్స్ లేదా యూ ట్యూబ్ చానెల్స్‌కు దఢ పుట్టేలా చేయడానికి టాలీవుడ్ అంతా ఏకమైందన్న మాట. ఇది ఆచరణలోకి వస్తే మంచిదే కానీ.. రాని పక్షంలో పరిస్తితులు మరోలా ఉంటాయేమో. ఏం జరుగుతుందో..? పెద్దన్న ఏం చేయబోతున్నాడో..? జస్ట్ వెయిట్ అండ్ సీ.
By May 10, 2020 at 06:07PM
No comments