భారత్ సరిహద్దుల్లో చైనా చర్యలపై అమెరికా సంచలన వ్యాఖ్యలు
భారత్- చైనా సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల విషయంలో డ్రాగన్‌పై అగ్రరాజ్యం అమెరికా పదునైన విమర్శలు గుప్పించింది. సరిహద్దుల్లో చైనా చర్యలను విపరీత ప్రవర్తనగా అభివర్ణించింది. దక్షిణ చైనా సముద్రంలోనూ తన ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంలో చైనా వ్యవహారశైలి ప్రమాదకారిగా మారిందని అమెరికా విదేశాంగ శాఖకు చెందిన సీనియర్ అధికారి అలీస్ వెల్స్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చైనా వ్యవహార శైలి ఆందోళనకరంగా ఉంది... దక్షిణ చైనా సముద్రం, భారత సరిహద్దుల్లోనూ తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలను చూస్తూనే ఉన్నాం.. తన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలనే వైఖరితోనే ఇలా చేస్తోందని’ అన్నారు. కరోనా వైరస్ విషయమై అమెరికా, చైనాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తికి ప్రపంచ ఆరోగ్య సంస్థను చైనా ఒక ఉపగ్రహంగా వినియోగించుకుందని ఆరోపించారు. సరిహద్దుల్లోని వివాదాలు కొన్నిసార్లు భౌతిక దాడులు, ఘర్షణలకు దారితీయడం కొత్తేం కాదని అన్నారు. చైనా ఈ ఏడాది లడఖ్‌లో కొత్త స్థావరాన్ని ప్రారంభించడంతో భారత్‌లో ఆందోళన వ్యక్తమయ్యిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వివిధ దేశాల మధ్య తలెత్తే వివాదాలు, ఉద్రిక్తతలను దౌత్య, త్రైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే.. చైనా మాత్రం ఆధిపత్య ధోరణి ప్రదర్శిసోందని దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలను అందించే అంతర్జాతీయ వ్యవస్థను తాము కోరుకుంటున్నాం. కాబట్టి, సరిహద్దు వివాదాల విషయంలో చైనా బెదిరింపులకు గుర్తుచేస్తోందని తాను భావిస్తున్నాను ఆమె తెలిపారు. పాకిస్థాన్ మీదుగా చైనా నిర్మిస్తోన్న చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)ని దోపిడీగా అభివర్ణించారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ప్రాజెక్టులలో పారదర్శకత లేకపోవడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వాటిళ్లే నష్టం, ఆ దేశంలో వాణిజ్య అసమతౌల్యతకు దారితీస్తాయని అన్నారు. ఈ దోపిడీ వల్ల అన్యాయమైన రుణాలు పాకిస్తాన్‌కు భారంగా మారుతున్నాయని, దీనిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ రుణాలను మాఫీ చేయడం లేదా తిరిగి చర్చలు జరపడం, న్యాయమైన ఒప్పందాన్ని చేసుకోవడం వంటి చర్యలను చైనా ప్రారంభిస్తుందని తాము ఆశిస్తున్నాం అని వెల్స్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి ప్రక్రియపై కూడా వెల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారతదేశం పాత్ర చాలా కీలమని అన్నారు. తాలిబన్లతో నేరుగా చర్చలు జరపాలని,రాజకీయ ప్రభుత్వ నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్న పరిస్థితిలో, భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండాలని అలీసియా వెల్స్ స్పష్టం చేశారు.
By May 21, 2020 at 08:30AM
No comments