దేశంలో కరోనా రికవరీ రేటు.. ప్రతి ఐదుగురిలో కోలుకుంటున్న ఇద్దరు
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మే నెల ప్రారంభం నుంచి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 5,614 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మరో 140 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మిగతా దేశాలతో దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితి మెరుగ్గానే ఉండగా.. రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,12,750 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. వారిలో 45,422 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 63,165 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,434 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో ప్రతి లక్షకు 62 మందికి కరోనా సోకుతుండగా.. భారత్‌లో మాత్రం ఆ సంఖ్య 7.9గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్ వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో కోవిడ్ బారినపడి 4.2 శాతం మంది మృతిచెందగా.. భారత్‌లో ఈ సంఖ్య కేవలం 0.2గా ఉందని ఆయన తెలిపారు. దేశంలో ప్రస్తుతం నాలుగో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది.. తొలిదశ లాక్‌డౌన్ నాటికి రికవరీ రేటు 7.1శాతం ఉండగా.. రెండో దశలో 11.42శాతం ఉందన్నారు. ఆ తర్వాత మూడో దశలో ఇది 26.59శాతానికి పెరిగిందని, ప్రస్తుతం 39.62 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. దేశంలో సోకిన ప్రతి ఐదుగురిలో ఇద్దరు కోలుకుంటున్నారని అన్నారు. కరోనా బారిన పడినవారిలో 62వేల మందికి పైగా చికిత్స పొందుతుండగా.. వారిలో 2.94శాతం ఆక్సిజన్ సపోర్టుతో ఉన్నారని తెలిపారు. అలాగే, 3శాతం మంది ఐసీయూలో, 0.45శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారని వివరించారు. అయితే, కరోనా వైరస్ కేసుల వివరాలపై తొమ్మిది రోజుల తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మీడియా సమావేశం బుధవారం ఏర్పాటు చేయడం విశేషం. అంపన్ తుఫానుపై జాతీయ విపత్తు నిర్వహణ దళం, వాతావరణ విభాగంతో కలిసి ఆరోగ్య శాఖ అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో పాజిటివ్ కేసుల దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో ఉంది. రష్యా తర్వాత తక్కువ సంఖ్యలో భారత్‌లోనే నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా మరణాల్లో 64 శాతం నాలుగు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలోనే అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం కేసుల్లోనూ 70 శాతం ఇక్కడే నిర్ధారణ అవుతున్నాయి. మహారాష్ట్రలో రికవరీ రేటు 26 శాతంగా ఉంది. గుజరాత్‌లో మాత్రం మరణాల రేటు జాతీయ సగటును మించిపోయింది. అక్కడ కరోనా మరణాలు 6 శాతంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కాగా, రోజుకు లక్ష మందికి కరోనా నిర్ధారణ పరీక్షల చేసే సామర్థ్యానికి చేరినట్టు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. గడచిన 24 గంటల్లో 1,08,211 పరీక్షలు జరిపినట్టు తెలిపింది. బుధవారం వరకు దేశ వ్యాప్తంగా 25,36,156 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా కట్టడికి కఠిన చర్యలను అవలంబించడంపై దృష్టిపెట్టాలని సూచించింది. చేతుల్ని శుభ్రం చేసుకోవడం, పరిసరాలను శానిటైజ్ చేయడం, భౌతికదూరాన్ని ఒక అలవాటుగా చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు.
By May 21, 2020 at 09:00AM
No comments