దేశంలో మరింత ఉద్ధృతంగా కోవిడ్.. మంగళవారం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు
దేశంలో ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం ఉదయానికి లక్ష దాటేయగా.. గడిచిన 24 గంటల్లో మరో 5,200 మందికి కొత్గా వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు ఒక్క రోజు నమోదుకావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా మరో 146 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనే సగం ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 76 మంది ప్రాణాలు కోల్పోగా.. ముంబయి నగరంలోనే 43 మంది ఉన్నారు. ఇక, వరుసగా మూడో రోజు మహారాష్ట్రలో 2,000పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం అత్యధికంగా 2,127 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ముంబయిలోనే 1,411 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 42,309గా నమోదయ్యింది. నమోదయిన కేసులతో పోల్చితే రికవరీ రేటు 39.8 శాతంగా నమోదయ్యింది. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 107,475కి చేరగా.. వీరిలో 3,302 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 61వేల మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు, గుజరాత్‌లోనూ మహమ్మారి ఏమాత్రం తగ్గడంలేదు. తమిళనాడులో మంగళవారం 688 కొత్త కేసులు నమోదుకాగా.. ఒక్క చెన్నై నగరంలోనే 552 ఉండటం గమనార్హం. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 10,554గా నమోదయ్యింది. మంగళవారం అక్కడ 500 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఢిల్లీ తర్వాతి స్థానాల్లో గుజరాత్ (398), రాజస్థాన్ (338), ఉత్తరప్రదేశ్ (321), మధ్యప్రదేశ్ (229), కర్ణాటక (149), పశ్చిమ్ బెంగాల్ (137), బీహార్ (96), ఆంధ్రప్రదేశ్ (57), అసోం (46), తెలంగాణ (42) నిలిచాయి. కర్ణాటక, అసోం, బీహార్‌లో తొలిసారి పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికుల రాకతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల్లో 40 శాతం రాష్ట్రానికి తిరిగొచ్చిన వలస కార్మికులకు నిర్ధారణ అయినవే. బస్తీ జిల్లాలో మంగళవారం 44 కేసులు నమోదు కాగా.. వీరంతా మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వలస కార్మికులేనని అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌లో తొలిసారి 300పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో నమోదయిన కేసుల్లో దుంగార్పూర్ జిల్లాల్లో అత్యధికంగా 87కి మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 143కి చేరింది. పాజిటివ్ కేసులు 5,845గా నమోదయ్యాయి.
By May 20, 2020 at 08:17AM
No comments