వరంగల్: పాడుబడిన బావిలో ఐదో మృతదేహం లభ్యం.. ఆ గొడవే కారణమా?
వరంగల్ నగర శివారులోని ఓ పాడుబడ్డ బావిలో నాలుగు మృతదేహాలు లభ్యమైన ఘటనలో అనుమానాలు తలెత్తుతున్నాయి. గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఓ గన్నీ సంచుల గోడౌన్ వద్ద ఉన్న బావిలో నలుగురి శవాలను గుర్తించగా.. మృతుల్లో భార్యాభర్తలు, వారి కుమార్తె, మనవడు ఉండటంతో వీరంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తొలుత భావించారు. మృతులను ఎండీ మక్సూద్(50), నిషా(45), బుస్ర (20), మూడేళ్ల మనవడిగా గుర్తించారు. కానీ మరో నలుగురి జాడ కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌కు చెందిన మక్సూద్ 20 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా వరంగల్ వలస వచ్చాడు. వీరు గత ఏడాది డిసెంబరు నుంచి గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న గన్నీ సంచుల తయారీ గోడౌన్‌లో పనిచేస్తున్నారు. వరంగల్‌లోని కరీమాబాద్ ప్రాంతంలో వీరు అద్దెకు ఉండేవారు. కానీ లాక్‌డౌన్ వల్ల ఇంటి నుంచి రావడానికి ఇబ్బందిగా ఉండటంతో.. కొద్ది రోజుల నుంచి గోదాంలో ఉన్న రెండు గదుల్లోనే మక్సూద్ దంపతులు, వారి ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తకు దూరంగా ఉంటున్న కుమార్తె బుస్ర సైతం.. తన కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు సైతం గోడౌన్‌లోని మరో గదిలో ఉంటూ పని చేస్తున్నారు. అంటే మొత్తం 8 మంది ఒకే ప్రాంగణంలో నివాసం ఉంటూ ఉపాధి పొందుతున్నారు. గోడౌన్ యజమాని సంతోష్ గురువారం మధ్యాహ్నం అక్కడికి వచ్చే సరికి పనిచేసే వారెవరూ కనిపించలేదు. ఆ ప్రాంగణం మొత్తం పరిశీలించగా.. పాడు బడిన బావి సమీపంలో వారి వస్తువులు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి చూడగా.. నాలుగు మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. దీంతో ఆయన గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో వీరు ఆత్మహత్య చేసుకొని ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా మక్సూద్ కుమారుడు, ఆ గోడౌన్‌లో పని చేసే మరో ఇద్దరు బిహార్ యువకులు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల మక్సూద్ మనవడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా.. ఆ వేడుకల్లో మక్సూద్ కూతురి విషయంలో బిహార్ యువకులు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగినట్లు అమానిస్తున్నారు.
By May 22, 2020 at 09:37AM
No comments