Breaking News

ముంబయిలో కరాళనృత్యం.. రంగంలోకి దిగిన సైన్యం


ముంబయి నగరంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకూ దాదాపు 40 వేల మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ముంబయి నగరంలోనే 24వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. రోజుకు వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాలని నిర్ణయించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. దీనికి సైన్యం సహాయం తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో ఐదు కంపెనీల పారా మిలటరీ బలగాలను కేంద్రం పంపింది. ముంబయికి సోమవారం పారా మిలటరీ దళాలు చేరుకోగా.. బుధవారం నుంచి పలు ప్రాంతాల్లో వీటిని మోహరించారు. ఇందులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు. దక్షిణ ముంబయి ప్రాంతంలో దళాలు బుధవారం రాత్రి కవాతు నిర్వహించాయి. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలుచేస్తున్నారు. ధారవీ సహా పలు ప్రాంతాల్లో సైన్యం విధులు నిర్వహిస్తోందని ఓ అధికారి వెల్లడించారు. బుధవారం రాత్రి భెండి బజార్ ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ దళాలు కవాతు నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తోన్న పోలీసుల్లో 1,300 మందికి కరోనా వైరస్ సోకగా.. వీరిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయి నగరంలోనే 700 మంది పోలీసులకు వైరస్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం సైన్యం రాకతో ముంబయి పోలీసులకు కొంత ఉపశమనం లభిస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ వేళ ముంబయి నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులకు కేంద్ర బలగాలు సహకారం అందజేస్తాయని తెలిపారు.


By May 21, 2020 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/central-forces-conducts-flag-march-in-mumbai-to-enforce-lockdown/articleshow/75860816.cms

No comments