Breaking News

కరోనాతో చనిపోయిన వ్యక్తులకు పోస్ట్‌మార్టమ్‌పై కేంద్రం కీలక సూచనలు


కరోనా వైరస్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలకు ప్రత్యేకంగా పోస్ట్‌మార్టం నిర్వహించాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) తాజా మార్గదర్శకాల్లో తెలిపింది. కొవిడ్‌-19 తీవ్రమైన అంటువ్యాధి కాబట్టి పోస్టుమార్టం నిర్వహించే వైద్యులకు అది సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. కరోనా మరణం మెడికో లీగల్‌ కేసు కానందున ప్రత్యేక పోస్టుమార్టం అవసరంలేదని, సదరు వ్యక్తికి చికిత్స అందించిన డాక్టర్‌ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేసింది. అయితే, ఎవరైనా కొవిడ్‌ లక్షణాలతో చనిపోతే వారి మృతదేహాల ముక్కుల నుంచి స్వాబ్‌ తీసి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలకు పంపాలని సూచించింది. భౌతిక కాయాలను మార్చురీకి తరలించే ముందే ఈ పని చేయాలని తెలిపింది. ఆత్మహత్యలు, ప్రమాదాలు, కొవిడ్‌-19తో మరణించినట్లు అనుమానం ఉన్న మృతదేహాలు ఆసుపత్రులకు వచ్చినప్పుడు సాధారణ పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఆ మరణాలకు నేరంతో సంబంధం లేదని ధ్రువీకరించి, మెడికో లీగల్‌ పోస్టుమార్టం అవసరం లేదని చెప్పే అధికారం పోలీసులకు ఉంటుందని స్పష్టం చేసింది. అనుమానిత కేసులకు పరీక్షలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వెలువడే వివిధ స్రావాలు సయితం వైరస్‌ను వ్యాపింపజేస్తాయని, అందువల్ల మృతదేహాల రవాణాలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసింది. మృతదేహాలు ఎంత వ్యవధి తర్వాత వైరస్‌ రహితమవుతాయో చెప్పలేమనీ, వైరస్‌ బతికి ఉండే అవకాశం క్రమేపీ క్షీణిస్తుందని తెలిపింది. పోస్టుమార్టం నిర్వహించే సిబ్బందికి ముప్పు పొంచి ఉంటుంది కాబట్టి కోత అవసరం లేని మెళకువలు పాటించాలని సూచించింది. అయితే, గత నెలలో ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో మాత్రం కొన్ని కేసుల్లో తప్పించి మృతదేహాల నుంచి స్వాబ్స్ సేకరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. తాజాగా, మార్గదర్శకాలపై ఐసీఎంఆర్ టెక్నికల్ అడ్వైజర్ సుభాష్ సోలంకే మాట్లాడుతూ.. ఈ అంశంలో కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రాలు ఆచరించాలని అన్నారు. తాము జాతీయంగా రూపొందించిన నిబంధనలు కాబట్టి వాటినే అనుసరించాల్సి ఉంటుందన్నారు. కానీ, మృతదేహాల నుంచి స్వాబ్ సేకరించి, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయడం రాష్ట్రాలకు తలకు మించిన భారమని, ఫలితాలు వచ్చేవరకకూ వాటిని భద్రపరచడం కూడా కష్టమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మార్చురీలో నిండిపోవడంతో ఫలితాలు రావడానికి రెండు మూడు రోజులు పడుతుందని, అంతవరకూ డెడ్ బాడీలను ఎక్కడ భద్రపరచగలమని అంటున్నారు.


By May 21, 2020 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-tests-on-bodies-new-icmr-guidelines-advise-collection-of-swabs/articleshow/75860230.cms

No comments