కరోనాకు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో కీలక పరిణామం.. బీబీఐఎల్‌తో ఐసీఎంఆర్ టైఅప్
మహమ్మారి నియంత్రణకు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారత్ కూడా వ్యాక్సిన్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు నిర్వహించే భారత్ బయోటకెక్ ఇంటర్నేషనల్‌తో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చేతులు కలిపింది. ఐసీఎంఆర్‌కి చెందిన పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సేకరించిన వైరస్ జన్యువును (వైరస్ స్టెయిన్) ఉపయోగించుకొని స్వదేశీ వ్యాక్సిన్‌ను సాకారం చేయడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఇందులో భాగంగా ఈ వైరస్ స్టెయిన్‌ను భారత్ బయోటెక్ సంస్థకు ఎన్‌ఐవీ విజయవంతంగా బదిలీ చేసినట్లు ఐసీఎంఆర్ శనివారం ప్రకటించింది. వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించింది. టీకా రూపకల్పనలో భారత్ బయోటెక్‌కు ఎన్‌ఐవీ నిరంతర సహకారం అందజేస్తుందని తెలిపింది. టీకాను త్వరగా అభివృద్ధి, ఆ తర్వాత జంతులపై అధ్యయనం, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అవసరమైన అనుమతులను వేగంగా పొందడానికి ఐసీఎంఆర్, భారత్ బయోటెక్‌లు కృషి చేస్తాయని వివరించింది. అయితే, ప్రీ-క్లినికల్ స్టడీస్‌కు సంబంధించిన తదితర విషయాలను మాత్రం వెల్లడించలేదు. దీనిపై లిమిటెడ్ సీఎండీ కృష్ట ఎల్ల మాట్లాడుతూ.. జాతీయ ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ఐసీఎంఆర్, ఎన్‌ఐవీలతో కలిసి పనిచేయడం మాకు గర్వకారణమని అన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరు కోసం దేశం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తామని, వర్ధమాన దేశాల్లో బయోసేఫ్టీ లెవెల్-3 స్థాయి ఉత్పాదక కేంద్రమున్న ఏకైక సంస్థ తమదేనని, ఇది కూడా మాకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ముక్కు ద్వారా చుక్కల మందు రూపంలో వేసే కరోనా టీకాను రూపొందిస్తున్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘కోరోఫ్లూ’ అని పిలుస్తోన్న ఈ టీకాను యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్, ఫ్లూజెన్ అనే వ్యాక్సిన్ కంపెనీలతో కలిసి భారత్ బయోటెక్ డెవలప్ చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించనుంది. క్లినికల్ ట్రయల్స్‌తోపాటు ఉత్పత్తి బాధ్యతలను భారత్ బయోటెక్ తీసుకుంది. మొత్తం 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నారు.
By May 10, 2020 at 06:56AM
No comments