Breaking News

ఆ రోజు చిరంజీవి గారి ఇంటికెళ్తే.. రాధిక శరత్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్


తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవిది అలుపెరగని ప్రస్థానం. కెరీర్ తొలినాళ్లలోనే తానేంటో నిరూపించుకున్న ఆయన మెగాస్టార్‌గా వెలుగొందుతూ నేటికీ అదే టెంపో మెయిన్‌టైన్ చేస్తున్నారు. 80వ దశకం నుంచి 2020 వరకు మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో విజయాలు, మరెన్నో అద్భుతాలు. ఆ నాటి నుంచి నేటివరకు ఎందరో స్టార్ హీరోయిన్లతో కలిసి ఆడిపాడారు. అయితే ఎంతమంది హీరోయిన్లతో నటించినప్పటికీ రాధికతో ఆయనేసిన చిందులు అప్పట్లో ప్రేక్షకులను హుషారెత్తించాయి. ''నవ్వింది మల్లె చెండు.. నచ్చింది గర్ల్ ఫ్రెండు'' అంటూ రాధికతో ఆయన పండించిన కెమిస్ట్రీ యమ కిక్కిచ్చింది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన రాధిక, ఆమె భర్త శరత్ కుమార్.. చిరంజీవితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. కెరీర్‌లో ఎవర్ గ్రీన్ మూవీ 'జగదేక వీరుడు అతిలోకసుందరి' సినిమా (మే 9వ తేదీ) నిన్నటితో 30 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తమ జీవితంలో ఎన్నటికీ మరవలేని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిరంజీవి కుటుంబంతో తమకు స్పెషల్ బాండింగ్ ఉందని అన్నారు . చిరంజీవి కెరీర్ మొదలైనప్పటి నుంచి ఆయన అందుకున్న ప్రతీ విజయం, ప్రతీ స్టెప్ తననెంతో సంతోషపెట్టాయని రాధిక చెప్పారు. అంతేకాదు చిరంజీవి స్నేహితురాలినని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని ఆమె తెలిపారు. ఇకపోతే తన లైఫ్‌లో కష్టకాలంలో చిరంజీవి ఎలా స్పందించారు, ఆయన దగ్గరికెళ్తే ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు రాధిక భర్త శరత్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. ''నేను ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నపుడు ఓ పెద్ద ప్రొడ్యూసర్ నన్ను సంప్రదించి చిరంజీవి గారి డేట్స్ ఇప్పించమన్నారు. ఆ సినిమా చేసి లాభం వస్తే మీకు ఆర్ధిక సాయం చేస్తా.. మీ కష్టం తీరుతుందని చెప్పారు. చిరంజీవితో గ్యాంగ్ లీడర్ తో పాటు మరో కొన్ని సినిమాలు చేశాను కాబట్టి ఆయనతో కొంత సాన్నిహిత్యం ఉంది. ఆ ఉద్దేశ్యంతోనే చిరంజీవికి ఫోన్ చేసి హైదరాబాద్ వెళ్లి కలిశాను. నేను వెళ్లిన సమయంలో ఆయన షూటింగ్ లొకేషన్‌లో ఉన్నారు. నన్ను చూసి ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి 'ఏంట్రా.. ఇక చెప్పు' అని అడిగారు. అప్పుడు నా సమస్యలు చెప్పి ఓ ప్రొడ్యూసర్ నన్నిలా అడిగారని చిరంజీవి గారితో చెప్పా. వెంటనే ఆయన సినిమా చేస్తున్నా అనేశారు. సార్ మీ రెమ్మ్యూనరేషన్ ఎంత? అని అడిగాను. నువ్వు సమస్యల్లో ఉన్నానని చెప్పి నాకు రెమ్మ్యూనరేషన్ ఇస్తావురా! వద్దు.. సినిమా చేస్తా.. నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని మాటిచ్చారు. అలా ఆయనిచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేనిది. ఇప్పటికీ కృతజ్ఞుడనై ఉన్నా'' అంటూ ఎమోషనల్ అయ్యారు శరత్ కుమార్.


By May 10, 2020 at 09:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/radhika-sharath-kumar-emotional-comments-on-chiranjeevi/articleshow/75654199.cms

No comments