లారీ బోల్తా, ఐదుగురు వలస కూలీల మృతి.. హైదరాబాద్ - ఆగ్రా వెళ్తూ ‘మధ్య’లోనే..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో పట్టాలపై నిద్రిస్తోన్న 16 మంది వలస కూలీల పై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటన మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. మామిడి పండ్ల లోడుతో హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్న లారీ మధ్య ప్రదేశ్‌లో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స అందించడం కోసం జబల్‌పూర్ తరలించారు. శనివారం అర్ధరాత్రి దాటాక మధ్యప్రదేశ్‌లోని నర్సింఘ్‌పూర్ జిల్లా పఠా గ్రామం సమీపంలోకి వెళ్లగానే పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్‌లో 18 మంది ఉండగా.. ఐదుగురు చనిపోయారని, మిగతా వాళ్లు గాయపడ్డారని నర్సింఘ్‌పూర్ జిల్లా కలెక్టర్ దీపక్ సక్సేనా తెలిపారు. వీరంతా హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్నారన్నారు. ప్రమాదానికి గురైన వలస కార్మికుల్లో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరికీ కోవిడ్ టెస్టులు చేశారని సమాచారం.
By May 10, 2020 at 08:40AM
No comments