Breaking News

సెలూన్‌‌లోని హెయిర్ స్టయిలిస్ట్ నుంచి 91 మందికి కరోనా వైరస్!


అగ్రరాజ్యం అమెరికాలో బాధితుల సంఖ్య 17 లక్షలకు చేరవవుతోంది. మహమ్మారి దెబ్బకు 99,300 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత ఆంక్షలను సడలించారు. అయితే, లాక్‌డౌన్ ఎత్తేసిన త‌రువాత‌ కరోనా మ‌రింత‌గా వ్యాప్తి చెందుతోంది. మిస్సౌరీలో ఓ హెయిర్‌స్టయిలిస్ట్ ద్వారా 91 మందికి వైరస్ సోకినట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 84 మంది కస్టమర్లు, ఏడుగురు సెలూన్ వర్కర్లు ఉన్నారు. స్టైలిస్ట్, కస్టమర్లు ఫేస్ కవరింగ్ ధరించకపోవడం వల్లే వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. ఫేస్‌కవర్స్ ధరించినవారికి వైరస్ సోకలేదని, ఎవరికైనా ఇంకా లక్షణాలు బహిర్గతమైతే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆంక్షలు సడలించిన తర్వాత మిస్సౌరీలో సెలూన్లు మే 4 న నుంచి తెరుస్తున్నారు. ఇప్పటివరకు ఇక్క‌డ 11,752 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 676 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, వాషింగ్టన్‌లోని స్పోకనే నగరంలోని పాస్తా ఫ్యాక్టరీలో 22 మంది ఉద్యోగులకు క‌రోనా సోకినట్లు గుర్తించారు. వాషింగ్ట‌న్‌లో పాక్షిక లాక్‌డౌన్ అమ‌లులో ఉంది. ఈ నేప‌థ్యంలో కొన్ని ఆహార పరిశ్రమలు తెరుచుకున్నాయి. ఇక్క‌డ సెలూన్లు, జిమ్‌లు జూన్ 1 తర్వాత తిరిగి ప్రారంభించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. వాషింగ్టన్‌లో మొత్తం 20,395 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 1,076 మంది మరణించారు. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో లాక్‌డౌన్‌ల‌ను ఎత్తివేస్తున్నారు. కాగా, అమెరికాలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య భారీగా పడిపోయిందన్నారు. దేశంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షకు చేరువవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సుదీర్ఘకాలం లాక్‌డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థ మరింత దిగజారుతుందని, అంత ఉపయుక్తం కాదని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.


By May 25, 2020 at 11:55AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uss-missouri-hairstylist-may-have-exposed-91-people-to-covid-19-officials-say/articleshow/75966697.cms

No comments