Breaking News

దేశంలోని కరోనా కేసుల్లో 66 శాతం ఈ 13 ప్రాంతాల్లోనే


దేశంలో కేసుల సంఖ్య 40 వేలు దాటగా.. వాటిలో మూడింట రెండొంతుల కేసులు కేవలం 13 ప్రాంతాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం ఉదయానికి దేశంలోని 35 అతిపెద్ద పట్టణ ప్రాంతాల్లోనే 28,761 కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 72 శాతం. అలాగే 1301 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. 981 మంది లేదా 75 శాతానికిపైగా ఈ ప్రాంతానికి చెందిన వారేనని టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్లేషణలో తేలింది. ఈ 35 పట్టణ ప్రాంతాలు దేశ రాజధాని ఢిల్లీ సహా 16 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక రెండింట మూడొంతుల కేసులు నమోదైన 13 పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో 500కిపైగా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లోనే 26,483 కేసులు నమోదయ్యాయి. ఇది దేశంలోని కేసుల్లో 66 శాతానికి సమానం. మరణాల విషయానికి వస్తే కోల్‌కతా డేటా అందుబాటులో లేదు. కానీ ఈ 13 పట్టణ ప్రాంతాల్లోనే 915 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు. దేశంలోని కరోనా మరణాల్లో ఇది 70 శాతానికి సమానం. నగరాలతో, నగరాల శివారు ప్రాంతాలు, శాటిలైట్ సిటీలను ఈ పట్టణ ప్రాంతాల పరిధిలోకి తీసుకున్నారు. గ్రేటర్ ముంబైలో ఆదివారం ఉదయం నాటికి 9445 కేసులు నమోదు కాగా... ఢిల్లీ (ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, ఫరిదాబాద్, గుర్గావ్ కలుపుకొని) 4473 కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్ - గాంధీ నగర్ ప్రాంతంలో 3610 కేసులను గుర్తించారు. ఇండోర్, చెన్నై, పుణే ప్రాంతాల్లోనూ వెయ్యికిపైగా కేసులను గుర్తించారు. సూరత్, హైదరాబాద్‌లలో 600కుపైగా కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ, గుజరాత్‌లలో నమోదైన కేసుల్లో 90 శాతానికి పైగా ఈ పట్టణ ప్రాంతాల్లోనే నమోదయ్యాయి.


By May 04, 2020 at 06:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-19-in-india-13-urban-sprawls-reports-2/3rd-cases-of-the-country/articleshow/75525064.cms

No comments