ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కరోనా కేసులు.. 3.29 లక్షల మంది బలి
గతేడాది డిసెంబరు చివరిన చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన .. కార్చిచ్చులా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. రోజురోజుకూ మహమ్మారి ఉద్ధృతి పెరుగుతోంది. చైనా నుంచి ఐరోపాలో తొలుత పాదం మోపిన కరోనా వైరస్.. తర్వాత అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. కోవిడ్-19 ధాటికి పేద దేశాల నుంచి అగ్రరాజ్యాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ప్రజారోగ్యంతోపాటు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌తో ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించిపోయి సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్నారు. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య ఇప్పటి వరకూ 50 లక్షలు దాటింది. వీరిలో దాదాపు 16 లక్షల బాధితులు ఒక్క అమెరికాలోనే ఉన్నారు. చైనాను వణికించిన కొవిడ్.. తర్వాత ఐరోపా దేశాలను అతలాకుతలం చేసిన మహమ్మారి.. ఆపై అమెరికాలో మరణ మృదంగాన్ని మోగించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 3.26 లక్షల మందికిపైగా ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 95 వేలకుపైగా మరణాలు అమెరికాలోనే సంభవించాయి. ప్రస్తుతం ఐరోపా, అమెరికా, చైనా దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే- రష్యా, బ్రెజిల్ దేశాల్లో విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. రష్యాలో పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. కరోనా దెబ్బకు కుదేలయిన స్పెయిన్, ఇటలీ కాస్త కుదుటపడుతున్నాయి. బ్రెజిల్‌లో గడచిన 24 గంటల్లో 1,179 మంది ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది. ఇప్పటివరకు అక్కడ ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2.93 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 18,894గా నమోదయ్యింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి విధించిన లాక్‌డౌన్ నిబంధనలు పలుదేశాలు సడలిస్తున్నాయి. ముప్పు పూర్తిగా తొలగకపోయినా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతుండటంతో.. మరో దారి లేక పలు దేశాలు లాక్‌డౌన్‌లను సడలించాయి. ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేశాయి. దీంతో జనం మళ్లీ బయట గుంపులుగా చేరుతున్నారు. ఫలితంగా ఇన్నాళ్లూ పడ్డ శ్రమ అంతా వృథా అయ్యే ముప్పుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటించకపోతే మళ్లీ వైరస్ వ్యాప్తి పెరుగుతుందని.. రెండో దశ విజృంభణ మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు. అమెరికా, రష్యా తర్వాత బ్రెజిల్‌లో అత్యధికంగా 293,357 మంది, స్పెయిన్ 279,524, బ్రిటన్ 248,293, ఇటలీ 227,364, ఫ్రాన్స్ 181,575, జర్మనీ 178,531, టర్కీ 152,587, ఇరాన్ 126,949 మంది వైరస్ బాధితులు ఉన్నారు. అత్యధికంగా అమెరికాలో 94,994 మంది ప్రాణాలు కోల్పోగా, తర్వాత బ్రిటన్ 35,704, ఇటలీ 32,330, ఫ్రాన్స్ 28,132, స్పెయిన్ 27,888, బ్రెజిల్ 18,894, బెల్జియం 9,150 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
By May 21, 2020 at 09:35AM
No comments