Breaking News

దేశంలో కరోనా: నిన్న రికార్డుస్థాయిలో 5 వేల కేసులు.. 3వేలు దాటిన మరణాలు


దేశంలో తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూవస్తున్నాయి. గడచిన వారం రోజులుగా రోజుకు సగటున 4,000 కొత్త కేసులు నమోదువుతుండగా.. ఆదివారం కొత్త రికార్డు నమోదయ్యింది. దేశవ్యాప్తంగా 5,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలోనే అత్యధికంగా 2,347 కొత్త కేసులు నిర్ధారణ కావడం గమనార్హం. అలాగే, దేశంలో కరోనాతో మరో 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,698కి చేరగా.. మరణాలు 3,000 మార్క్ దాటింది. మహారాష్ట్రలో ఆదివారం 63 మంది మృతిచెందగా.. ఒక్క ముంబయిలోనే 38 మంది ఉన్నారు. తర్వాత గుజరాత్‌లో 34 మంది (ఒక్క అహ్మదాబాద్‌లోనే 31), ఢిల్లీ (19), ఉత్తరప్రదేశ్ (8), పశ్చిమ్ బెంగాల్ (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్ (5), తమిళనాడు (4) చోటుచేసుకున్నాయి. గడచిన 24 గంటల్లో 5వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. కేసులు రెట్టింపు సమయం మాత్రం పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు వారాలుగా 11.5గా ఉన్న రెట్టింపు సమయం మూడు రోజుల13.6గా నమోదయ్యింది. దేశంలో పాజిటివ్ కేసులు 90వేలకు చేరడానికి 107 రోజులు పడితే.. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, అమెరికాలో 44 నుంచి 46 రోజులు పట్టిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. మహారాష్ట్రలో ఒక్క రోజే 2,000కుపైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇందులో ఒక్క ముంబయి నగరంలో 1,595 కేసులు ఉన్నాయి. తమిళనాడు 639, ఢిల్లీలో 422, రాజస్థాన్ 242, ఉత్తరప్రదేవ్ 208 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఉత్తరప్రదేశ్ 4,467 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ఇందులో 70 శాతం గత రెండు వారాలుగా నమోదయినవేనని యూపీకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. తమిళనాడులో బాధితుల సంఖ్య 11,224కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై నగరంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 6,750గా ఉంది. వైరస్ పెరుగుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. బీహార్‌లోనూ పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వలస కార్మికుల్లోనే ఎక్కువ మందికి వైరస్ సోకినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్కడ 560 మంది వలస కార్మికులకు వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,284గా నమోదయ్యింది. ఇక, గుజరాత్‌లో ప్రతి 42 నిమిషాలకు ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నారు. గడచిన 24 గంటల్లో 34 మంది ప్రాణాలు కోల్పోగా.. అక్కడ మొత్తం కరోనా మరణాలు 659గా నమోదయ్యాయి. అలాగే, మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా పాజిటివ్ కేసులు కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం 11,300 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ముంబయి మాదిరిగానే అహ్మదాబాద్‌లోనూ వైరస్ ఉద్ధృతంగా ఉంది. అటు కేరళలోనూ ఒక్కసారిగా 100 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం తెలంగాణలో 42, ఆంధ్రప్రదేశ్‌లో 25 కేసులు నమోదయ్యాయి.


By May 18, 2020 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-in-india-for-first-time-new-cases-top-5000-deaths-up-by-154/articleshow/75796655.cms

No comments