కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ రాదేమో.. బ్రిటన్, ఇటలీ ప్రధానులు నిర్వేదం
కరోనా వైరస్ మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రపంచ మొత్తం విలవిలలాడుతోంది. మాయదారి వైరస్‌కు మందు ఎప్పుడొస్తుందా? అని జనం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటలీ, బ్రిటన్ ప్రధానులు చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్‌ను నిలువరించే సమర్ధవంతమైన టీకా సమీప భవిష్యత్తులో రాకపోవచ్చని ఇటలీ ప్రధాని గిసెప్పీ కొంటె, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. వైరస్‌తో కలిసి ముందుకు సాగాల్సిందేనని వ్యాఖ్యానించారు. కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతోన్న నేపథ్యంలో.. లాక్‌డౌన్‌లను ఎత్తివేసి, తిరిగి ార్ధిక కార్యకలాపాలను ప్రారంభించాల్సిన ఆవశ్యకతను వారు నొక్కిచెప్పారు. ప్రాంతీయ నేతల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో, గతంలో నిర్ణయించిన షెడ్యూలు కంటే ముందే ఇటలీలో ఆంక్షలను సడలించాలని కొంటె నిర్ణయించారు. అక్కడ రెస్టారెంట్లు, బార్లు, బీచ్‌లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో కొంటె మాట్లాడుతూ.. ‘‘మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఆ వాస్తవాన్ని మనమంతా అంగీకరించాల్సిందే. కానీ, మొండిగా ముందడుగు వేయడం తప్ప మరో మార్గం లేదు. టీకా అందుబాటులోకి వచ్చే వరకు వేచి చూడలేం’’ అని అన్నారు. మహమ్మారి తీవ్రత మళ్ళీ పెరగవచ్చని, అయితే టీకా కోసం వేచి ఉండలేమని అన్నారు. జూన్ 3 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. మే 25 నుంచి జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ సెంటర్లు, జూన్ 15 నుంచి సినిమాథియేటర్లు తెరుచుకోనున్నాయని అన్నారు. ఐరోపా సమాఖ్య దేశాల నుంచే వచ్చే ప్రయాణికులు రెండు వారాల నిర్బంధం లేకుండా ఇటలీలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. మరోవైపు, వ్యాక్సిన్ ఎప్పటికీ అందుబాటులోకి రాకపోవచ్చునని బ్రిటన్ ప్రధానమంత్రి జాన్సన్ ఒకింత నిర్వేదం వ్యక్తం చేశారు. ‘సమర్ధవంతమైన వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. వైరస్‌తో కలిసి జీవించడం తప్పదన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి’ అని పేర్కొన్నారు. ‘కానీ మేము ప్రపంచ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నాం. వ్యాక్సిన్ల గురించి చాలా ఆశాజనకమైన పరిశోధనలు యుకేలోనే జరుగుతున్నాయి.. ఈ ఈ వారాంతంలో కొత్త వ్యాక్సిన్ తయారీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను షెడ్యూల్ కంటే 12 నెలల ముందే తెరవడానికి 93 మిలియన్ పౌండ్లను ప్రకటించాం’ అని అన్నారు. ప్రస్తుత నిర్మాణ దవలో ఉన్న ఇన్నోవేషన్ సెంటర్ ఆరు నెలల్లోపు బ్రిటన్ జనాభాకు తగినంత మోతాదులతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. షెడ్యూల్ కంటే ఒక ఏడాది ముందే 2021 వేసవిలో కేంద్రం ప్రారంభమవుతుందని ఈ నిధులు నిర్ధారిస్తాయని అన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలింపు మార్గదర్శకాల్లో గందరగోళం నెలకునడంతో బ్రిటన్ ప్రధాని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్కాట్లాండ్, వేల్స్ నార్తర్న్ ఐర్లాండ్‌లో ‘స్టే హోమ్’ఆదేశాలు జారీచేయగా.. ఇంగ్లాండ్‌లో మాత్రం ‘అప్రమత్తంగా ఉండండి’అని చెప్పడం కొంత సడలింపులను సూచిస్తుంది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By May 18, 2020 at 08:28AM
No comments