Breaking News

ఢిల్లీ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం.. 45 ఫైర్ ఇంజిన్‌లతో మంటలార్పుతోన్న సిబ్బంది


రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం అర్ధరాత్రి తర్వాత కీర్తినగర్ సమీపంలోని మురికివాడ చౌనా బస్తీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఎవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 45 ఇంజిన్‌లతో మంటలను ఆర్పుతున్నారు. దాదాపు ఆరు గంటల పాటు అధికారులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ప్రజలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ ప్రమాదంపై ఢిల్లీ ఫైర్ సర్వీస్ విభాగానికి చెందిన చీఫ్ ఆఫీసర్ రాజేశ్ పన్వార్ మాట్లాడుతూ.. గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చౌనా బస్తీలో మంటలంటుకున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మొత్తం 45 ఫైర్ ఇంజిన్‌ల సాయంతో మంటలను అతికష్టంమీద అదుపు చేశామన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఎవరూ గాయపడలేదని, మంటలు అదుపులోకి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అన్నారు. ప్రస్తుతం ప్రమాదం తప్పిందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, మురికివాడలోని పలు ఇళ్లు మంటలకు కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పశ్చిమ్ ఢిల్లీలోని ఓ ఫర్నిచర్ మార్కెట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగుర్ని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగి చుట్టుపక్కలకు వ్యాపించాయని, పొగ దట్టంగా అలుముకోవడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారని అధికారులు తెలిపారు. సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని చుట్టుపక్కలకు వ్యాపించకుండా మంటలను అదుపుచేశారని పేర్కొన్నారు. ఇక్కడ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలియజేశారు.


By May 22, 2020 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/massive-fire-breaks-out-at-delhi-slum-area-chuna-basti-45-fire-tenders-on-spot/articleshow/75881569.cms

No comments