ప్రపంచవ్యాప్తంగా 44 లక్షలు దాటిన కరోనా కేసులు.. 3 లక్షల మంది బలి
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుహేళ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మృతిచెందిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. వైరస్ బాధితుల సంఖ్య 44. 30 లక్షలను సమీపించింది. కోలుకున్నవారి సంఖ్య 16.60 లక్షలకుపైగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. తొందరపాటుతో ఆంక్షలను ఎత్తివేస్తే.. నియంత్రించలేని స్థాయిలో వైరస్ విజృంభించే ముప్పుందని, మరణాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పెయిన్‌లో కరోనా ఉద్ధృతి మళ్లీ స్వల్పంగా పెరిగింది. తాజాగా అక్కడ 24 గంటల వ్యవధిలో 184 మరణాలు, దాదాపు 400 కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో ఒక్కరోజులోనే 881 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12 వేలు దాటింది. రష్యాలోనూ మహమ్మారి తీవ్రంగా ఉంది. ఇప్పటికే అక్కడ బాధితుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. ‘రోస్టెక్’ ఉత్పత్తి చేసిన ‘అవెంటా-ఎం’ వెంటిలేటర్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం అగ్నిప్రమాదానికి గురవడంతో ఐదుగురు మరణించారు. దీంతో ఈ వెంటిలేటర్ వినియోగాన్ని నిలిపివేయాలని రష్యా నిర్ణయించింది. ఆఫ్రికాలోని చిన్న దేశమైన లెసొథోలో తొలి కేసు నమోదైంది. దీంతో ఆఫ్రికాలోని మొత్తం 54 దేశాలకూ వైరస్ పాకినట్లయింది. కాగా, 24 రోజుల విరామం తర్వాత హాంకాంగ్‌లో 66 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవరాలు(5) వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణాలేవీ చేయకున్నా, కొవిడ్ బాధితులను కలవకున్నా వారికి కరోనా సోకినట్టు పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లో వరుసగా రెండో రోజూ కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గురువారం నుంచి ఆ దేశంలో మాల్‌లు, రిటైల్ స్టోర్లు, రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,434,504కి చేరగా.. వీరిలో 85,197 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 271,095 కేసులు, 27,104 మరణాలు, బ్రిటన్‌లో 229,705 కేసులు, 33,186 మరణాలు.. రష్యాలో 242,271 కేసులు.. 2,212 మరణాలు, ఇటలీలో 221,216 కేసులు, 31,106 మరణాలు, ఫ్రాన్స్‌లో 178,0687 కేసులు, 27,074 మరణాలు, జర్మనీలో 174,098 కేసులు, 7,861 మరణాలు చోటుచేసుకున్నాయి. టర్కీలో 143,114 కేసులు, 3,952 మరణాలు, ఇరాన్ - 112,725 కేసులు, 6,783 మరణాలు, చైనాలో 84,011 కేసులు, 4,637 మరణాలు సంభవించాయి.
By May 14, 2020 at 10:20AM
Post Comment
No comments