ఒడిశా, బెంగాల్‌ను కుదిపేసిన అంపన్: 12 మంది మృతి... అంధకారంలో కోల్‌కతా
పశ్చిమ్ బెంగాల్- బంగ్లాదేశ్ మధ్య బుధవారం సాయంత్రం తీరం దాటిన బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ ప్రచండ తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాను దెబ్బకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ చిగురుటాకులా వణికిపోయాయి. తీరం దాటిన వేళ గంటకు 110- 190 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులకు తీర ప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లో 10 నుంచి 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. షాలిమార్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోనే మరణాలు చోటుచేసుకున్నట్టు సీఎం వివరించారు. నందిగ్రాం, దక్షిణ 24 పరగణాల జిల్లాలు సర్వనాశనమైపోయాయని ఆమె తెలిపారు. ఈ విషయంలో కేంద్రం మానవతాదృక్పథంతో ఆలోచించి రాష్ట్రానికి చేయూతనందించాలని, రాజకీయ కోణంతో చూడవద్దని విన్నవించారు. ఒడిశాలోనూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పశ్చిమ బెంగాల్‌లోని దిఘా- బంగ్లాదేశ్‌లోని హథియా దీవి మధ్య తీరాన్ని తాకిన తుఫాను సాయంత్రం 6.30 తర్వాత తీరాన్ని దాటింది. ఆ సమయంలో గంటకు 155 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కోల్‌కతా నగరంపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. లాక్‌డౌన్ నిబంధనలు సడలింపులతో దుకాణాలు తెరుచుకోగా.. తుఫాను నేపథ్యంలో వాటిని మూసివేయించారు. అయినా, సరే భారీ నష్టమే వాటిళ్లింది. కొన్ని చోట్ల 22.2 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయింది. కోల్‌కతా నగరం సహా పలు జిల్లాల్లో అంధకారం అలముకొంది. కొన్నిచోట్ల ట్రాన్స్‌ఫార్మర్స్ తగులబడ్డాయి. దీంతో మొబైల్ నెట్‌వర్క్ కూడా స్తంభించిపోయింది. బెంగాల్, ఒడిశాల్లో ఏడు లక్షల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలమైన గాలులు, భారీ వర్షాలతో ఒడిశాలోని పరదీప్ రేవు అతలాకుతలమైంది. తుఫాను కారణంగా, భువనేశ్వర్, కోల్‌కతా నుంచి నడవాల్సిన ప్రత్యేక రైళ్లను రద్దుచేశారు. భారత వాతావరణ విభాగం మూడు రోజుల ముందుగానే హెచ్చరించడంతో ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వాలు తీరప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. బెంగాల్‌లో ఏడు లక్షలు, ఒడిశాలో రెండు లక్షల మందిని శిబిరాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ, శానిటైజర్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచారు. తుఫాను తుఫాను హౌరాపై తీవ్ర ప్రభావం చూపింది.. కానీ, దక్షిణ 24 పరగణాల్లోని సుందర్బన్స్, పథార్‌ప్రతిమా, బసంతి, నమఖానా, కుల్తాలీ, బరౌపూర్, సోనార్‌పూర్, భంగర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయానని మమత పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉండకపోతే ప్రాణనష్టం భారీగా ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దంలోనే కోల్‌కతాను అతలాకుతలం చేసిన పెను తుఫానుగా అంపన్‌ను ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారులు అభివర్ణించారు.
By May 21, 2020 at 07:43AM
No comments