కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: కోవిడ్ నివారణకు టీటీడీ ఆయుర్వేద ఔషధాలు

⍟ కరోనాను నియంత్రించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని తమకు ఇవ్వాలని బ్రెజిల్ చేసిన విజ్ఞప్తిపై భారత్ సానుకూలంగా స్పందించింది. ఈ ఔషధాన్ని వారికి సరఫరా చేయాలని భారత్ నిర్ణయించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కృతజ్ఞతలు తెలియజేశారు. సరైన సమయానికి భారత్ విలువైన సాయం చేసిందని, దీన్ని తాము ఎన్నటికీ మరువబోమని ఆయన వ్యాఖ్యానించారు. తాను భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడానని, నా విజ్ఞప్తిని ఆయన మన్నించారన్నారు. శనివారం నాటికి బ్రెజిల్‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈలోగా ముడి పదార్థాలు ఉపయోగించి, దేశంలోనే టాబ్లెట్లు తయారు చేస్తామని బోల్సొనారో తెలిపారు. ⍟ మహమ్మారి నివారణలో భాగంగా ఆయుర్వేద ఔషధాన్ని అందజేయడానికి టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్షజ్ఞ ధూపం (క్రిమిసంహారక ధూపం), పవిత్ర (చేతులు శుభ్రపరచుకునే ద్రావకం), గండూషం (పుక్కిలించే మందు), నింబనస్యం (ముక్కులో పోసుకునే చుక్కల మందు), అమృత (వ్యాధి నిరోధక శక్తి పెంచే మాత్ర)లను తయారు చేశారు. మంగళవారం రాత్రి టీటీడీ జేఈవో పి.బసంత్‌కుమార్ వీటిని విడుదల చేశారు. ⍟ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి ప్రస్తుతం 208 దేశాలకు విస్తరించింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. అన్ని ఖండాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. కోవిడ్-19 కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. మొత్తం 350 కోట్ల మంది ఇళ్లకే పరిమితయ్యారు. కోట్లాది మంది జీవనోపాధిని సైతం మహమ్మారి చిన్నాభిన్నం చేసింది. అన్ని రంగాలూ స్తంభించిపోవడంతో ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలతున్నాయి. ⍟ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండగా.. దీనిపై బెన్నెట్ యూనివర్సిటీకి చెందిన టైమ్స్ స్కూల్ ఆఫ్ మీడియా ఒక్క రోజు ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 9న నిర్వహిస్తోంది. మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమ అనుభవాలను చర్చించడానికి మీడియా, వైద్య, పబ్లిక్ పాలసీ, టెక్నాలజీ విభాగాల్లోని ప్రముఖ నిపుణులు ఇందులో పాల్గొననున్నారు. ⍟ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సామూహిక దశలోకి ప్రవేశించిందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా.. దీనిని ఇప్పుడే ఎత్తివేయడానికి కేంద్రం సముఖం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. బుధవారం విపక్ష సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ⍟ కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న వేళ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ.. ముంబై నగర పాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాల్సిందేనని ముంబై నగర పాలక సంస్థ సూచించింది. మాస్కులు లేకుండా బయటకు వస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది.. ⍟ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 49 కేసులను కొత్తగా గుర్తించినట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 453కి చేరింది. ⍟ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా విధిగా పాటించాలని సూచించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించింది. ⍟ ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వారియర్ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 271 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, యునాని, ఆయుర్వేద నర్సింగ్ కాలేజీలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వారియర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ⍟ కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి రాష్ట్రంలో తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు వైసీపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాతో బాధపడుతున్న మొత్తం 9 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా వారిని డిశ్చార్జి చేశారు. బుధవారం ఒక్క రోజే విశాఖపట్నంలో ముగ్గురిని డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో డిశ్చార్జి అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
By April 09, 2020 at 09:35AM
No comments