ఇండియన్ ట్రంప్‌కి ‘పవర్’ లేదు: నాగబాబు షాకింగ్ పోస్ట్
జబర్దస్త్, అదిరింది లాంటి కామెడీ షోలలో మస్త్ కామెడీ పండించే జడ్జీ, మెగా బ్రదర్ సోషల్ మీడియాలో కూడా జోక్‌లు పేల్చుతున్నారు. ట్విట్టర్, యూట్యూబ్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించే నాగబాబుకి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ట్విట్టర్ వార్ నడుస్తోంది. నాగబాబు నటుడే కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలక నాయకుడు కావడంతో అధికార పార్టీపై విమర్శలు సంధిస్తున్నారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ విమర్శలు గుప్పించారు నాగబాబు. ఈయన ట్వీట్స్‌కి విజయసాయి ఘాటు రిప్లైలు ఇవ్వడంతో వీరిద్దరి మధ్య వైరం తారాస్థాయి చేరింది. అది వ్యక్తిగత దూషణలకు వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. కాగా కొద్దిసేపటి క్రితం మరో ట్వీట్ వదిలారు నాగబాబు. ‘ట్రంప్‌లు అమెరికాలోనే కాదండోయ్.. మన దేశంలో కూడా ఉన్నారు. లక్ ఏంటంటే మన ట్రంప్‌లకి అమెరికా ట్రంప్‌కి ఉన్న పవర్ లేక పోవడం మన దేశం చేసుకొన్న అదృష్టం’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఆ ఇండియన్ ట్రంప్ ఎవరా? అన్నది మాత్రం చెప్పలేదు నాగబాబు. అయితే ప్రధాని మోడీని అయితే కాదు.. ఎందుకంటే మన ప్రధానిని ఏకంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చుతూ ఆకాశానికెత్తేశారు నాగబాబు. ‘భారత దేశాన్ని అగ్ర రాజ్యాంగ నిలబెట్టగలిగే ఒక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని ప్రధానిగా చేసుకోలేక పోయాం. కానీ మన అందరి అదృష్టం మరో ఉక్కు మనిషి మోడీని దేశ ప్రధానిగా ఎన్నుకున్నాం. ఇలాంటి ప్రధాన మంత్రి ఇంకో నాలుగు టర్మ్స్ ఉంటే ఈ దేశానికి ప్రపంచంలో తిరుగు లేదు’ అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. అయితే నాగబాబు చేసిన ట్రంప్ ట్వీట్‌పై జనసేన, వైసీపీ శ్రేణులు స్పందిస్తూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. నాగబాబు ఎవర్ని ఇండియన్ ట్రంప్‌తో పోల్చారో తెలియదు కాని.. చాలామంది జనసైనికులు మాత్రం జగన్‌పై సెటైర్లు వేస్తూ నాగబాబు ట్వీట్‌పై కామెంట్స్ చేస్తున్నారు.
By April 20, 2020 at 11:14AM
No comments