ప్రపంచవ్యాప్తంగా లక్షన్నర దాటిన కరోనా మృతులు.. ఆగని కల్లోలం
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక సతమతవుతున్నాయి. ప్రపంచంలోని సగానికిపైగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల ప్రాణాలనే కాదు, వారి జీవనోపాధిని సైతం కరోనా చిన్నాభిన్నం చేసింది. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రోజువారీ కార్మికులు, వలస కూలీల వ్యతలు వర్ణనాతీతం. పనుల్లేక, సొంతూళ్లకు వెళ్లలేక పరాయి పంచన భిక్కుభిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాకాసి వైరస్ కోరల్లో చిక్కకుని రోజుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 154,320 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 22.50 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 9,400 మంది మృతిచెందారు. వైరస్ బారినపడ్డవారిలో దాదాపు 5.72 లక్షల మంది కోలుకున్నారు. మరో 15 లక్షల మందిలో స్వల్పంగా వైరస్ లక్షణాలు ఉండగా, 57,130 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. అమెరికాలో కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని రీతిలో కల్లోలం సృష్టిస్తోంది. మహోగ్రరూపం దాల్చిన రాకాసి... 24 గంటల్లోనే 4,591 మంది ప్రాణాలను బలి తీసుకుంది. సగటున నిమిషానికి కనీసం ముగ్గురు చొప్పున కరోనా దెబ్బకు అమెరికాలో మృతిచెందుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా మరణాలు, కేసుల విషయంలో వాస్తవాలను చైనా దాచిపెట్టిందని అంతర్జాతీయ సమాజం గుప్పిస్తున్న ఆరోపణలు నిజమేనని స్పష్టమవుతోంది. ఈ వైరస్ వెలుగుచూసిన వుహాన్ నగరంలో మృతులు, కేసుల లెక్కలను చైనా తాజాగా సవరించింది. నగరంలో అదనంగా 50% మరణాలను లెక్కల్లో చేర్చింది. దీంతో చైనాపై అగ్రరాజ్యాలు కారాలుమిరియాలు నూరుతున్నాయి. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 7లక్షలు దాటగా.. మరణాలు 37 దాటింది. ఐరోపాలో అన్ని దేశాలు కరోనా దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీలో కేసుల సంఖ్య లక్షలు దాటింది. స్పెయిన్‌లో 20,002, ఇటలీలో 22,745, ఫ్రాన్స్ 18,681, యూకేలో 14,576, జర్మనీలో 4,352 మరణాలు సంభవించాయి. జర్మనీలో కేసులు 141397 కేసులు నిర్దారణ అయినా మరణాల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. టర్కీలో 78,546 కేసులు నమోదు కాగా.. అక్కడ ఆంక్షలు విచిత్రంగా ఉన్నాయి. 20ఏళ్లలోపు.. 60ఏళ్లు దాటిన వ్యక్తులను ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆంక్షలు జారీచేశారు. ఈ అంక్షలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ అక్కడ 1,769 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వల్ల కలిగిన ఆర్థిక నష్టానికి పరిహారం కోరుతూ చైనాపై ఫెడరల్ కోర్టులో అమెరికన్లు దావా వేసేందుకు వీలు కల్పించే బిల్లును సెనేట్‌లో టామ్ కాటన్, ప్రతినిధుల సభలో డ్యాన్ క్రెన్‌షా ప్రవేశపెట్టారు ఇరాన్‌లో వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. వరుసగా మూడో రోజు మరణాల 100లోపు నమోదుకాగా.. కొత్త కేసులు కేసులు నమోదు కూడా గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకూ ఇరాన్‌లో 4,958 మంది ప్రాణాలు కోల్పోయారు. బెల్జియంలో 34వేలకుపైగా కేసులు నమోదు కాగా.. ఐదువేల మంది చనిపోయారు. బ్రెజిల్‌లోనూ మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. రష్యాలో మొత్తం 32 వేల కేసుల నమోదయ్యాయి.
By April 18, 2020 at 08:51AM
No comments