ఇస్మార్ట్ బ్యూటీ ఆన్‌లైన్ కోర్స్.. ఇదే అదనుగా ఆ పని స్టార్ట్ చేసిన నిధి అగర్వాల్
కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా వాడుకుంటున్నారు. కొందరు సరదాగా ఇంట్లో వాళ్ళతో గడుపుతుండగా, మరికొందరు తమ తమ కెరీర్‌లో వేయబోయే ఫ్యూచర్ స్టెప్స్ గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి దారినే ఎంచుకుంది ఇస్మార్ట్ బ్యూటీ . ఈ లాక్‌డౌన్ కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ తనలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ కోర్స్ నేర్చుకుంటోంది నిధి అగర్వాల్. తన ప్రొఫెషనల్ స్కిల్స్‌ను మెరుగు పరచుకునేందుకు గాను ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి శిక్షణ తీసుకుంటోంది. నటనలో మెలకువలతో పాటు స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ కోర్సులని కూడా ఆమె ఆన్‌లైన్ ద్వారా నేర్చుకుంటోందని తెలిసింది. ఇంటర్నెట్ పాఠాలు వింటూ సదరు వర్క్ నోట్ బుక్‌లో నోట్ చేసుకుంటున్న ఆమె పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ఇస్మార్ట్ బ్యూటీ తెరమీదే కాదు తెరవెనుక కూడా చక్రం తిప్పాలనే ఆలోచనలో ఉందని అర్థమవుతోంది. 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ చిత్రసీమకు పరిచయమైన నిధి.. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో అందాలన్నీ ఆరబోసి యువత దిమాక్ ఖరాబ్ చేసింది. మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. దీంతో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. మరికొద్ది రోజుల్లోనే మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది నిధి. అదేవిధంగా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా 'అల్లుడు అదుర్స్'లో కూడా ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసిందని తెలిసింది.
By April 20, 2020 at 11:28AM
No comments