60 రోజులు మాత్రమే.... ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ క్లారిటీ
అమెరికాలో విదేశీయుల వలసలపై నిషేధం విధిస్తూ మంగళవారం ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్వీట్ ద్వారా ఆయన ఈ ప్రకటన చేశాడు. తాజాగా విధివిధానాలపై ట్రంప్ స్పష్టత ఇచ్చారు. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం..దాదాపు 60 రోజుల పాటు వలసలపై నిషేధం కొనసాగుతుందన్నారు. ఇది కేవలం తాత్కలికంగా దేశంలో ఏర్పడిన సంక్షోభం నుంచి గట్టేందుకు తీసుకుంటున్న నిర్ణయంగా ఆయన తెలిపారు. లాక్‌డౌన్ అనంతరం తొలుత అమెరికా ప్రజలకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈనిర్ణయం తీసుకున్నానని సమర్థించుకున్నారు. మంగళవారం ట్వీట్ లో కూడా ఆయన ఇదే చెప్పారు. అమెరికన్ల ఉద్యోగ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ నిషేధం నుంచి ట్రంప్ కొందరికి మినహాయింపునిచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ముఖ్యంగా వైరస్‌పై పోరులో ముందున్న వైద్య సిబ్బంది, ఆహార సరఫరా విభాగంలో పనిచేస్తున్న విదేశీయులను నిషేధం నుంచి తొలగించొచ్చని ఆయన పాలకవర్గంలోని కొందరు అధికారులు చెబుతున్నారు. అలాగే వలసేతర వీసా అయిన హెచ్-1బీ పైనా స్పష్టతనిస్తూ మరో ఉత్తర్వు జారీ చేయొచ్చని కూడా భావిస్తున్నారు. ఇటు ట్రంప్ ప్రకటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వలస విధానాలను కఠినతరం చేయాలని చూస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అనేక దేశాల్లోని ప్రజలు ట్రంప్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మాత్తుగా ట్రంప్ నిర్ణయం ప్రకటించడంతో తమ కలలు కల్లలయ్యాయ్యని వాపోతున్నారు. ఇక అమెరికాకు వలస వెళ్లేవారిలో భారత్, చైనా దేశాస్థులే అధికం. మొదటి నుంచి ఆయన వలసలను నియంత్రించాలని చూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్-19ను అడ్డుపెట్టుకుని ట్రంప్ తన సొంత అజెండాను అమలు చేస్తున్నాడని కూడా అమెరికన్లు పేర్కొంటున్నారు. కరోనాను నియంత్రించడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఇప్పటికే అతనిపై విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఆ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రకటన చేశారని అమెరికాన్లు సైతం భావిస్తున్నారు.
By April 22, 2020 at 09:35AM
No comments