Breaking News

కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు.. ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు


కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడానికి భారత్ తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా సాధ్యమైనంత మేర పనిచేస్తోందని.. వ్యాక్సిన్, చికిత్స అభివృద్ధిలో అత్యాధునిక పరిజ్ఞానంపై పూర్తి విశ్వాసం ఉంచిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మంగళవారం స్పష్టం చేసింది. 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ కంటే మహమ్మారి అత్యంత ప్రమాదకరమని, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘోబ్రియోసిస్ హెచ్చరికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఐసీఎంఆర్ ఎపిడిమియాలజీ విభాగం చీఫ్ డాక్టర్ రామన్ ఆర్ గంగాఖేడ్కర్ వివరించారు. వైరస్ వ్యాప్తి తొలి దశలో ఉన్నప్పుడే భారత్ మేల్కొందని, లాక్‌డౌన్, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమలు చేసింది. ఈ రెండూ దేశంలో వైరస్ వ్యాప్తి వేగవంతం కాకుండా ఆపి, మేలుచేశాయన్నారు. చికిత్సను అందజేయడానికి ఆసుపత్రుల వంటి ఆరోగ్య మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ప్రాధాన్యత ఇచ్చామని, కొత్తరకం ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, చికిత్సలను వేగవంతం చేశామని తెలిపారు. కొత్త ఔషధాలు, వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయని, లాక్‌డౌన్ ఎత్తివేసినప్పుడు భారత్ వాటి నుంచి ప్రయోజనం పొందుతుందని, ఈ చర్యల కారణంగా కేసులు అదుపులో ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తమ వద్ద ఉన్న పలు ఆధారాలు కరోనా వైరస్‌ జంతువుల మూలాలను కలిగి ఉందని సూచిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీన్ని లేబొరెటరీలోనో, మరే ఇతర ప్రదేశాల్లో తయారుచేయలేదని, ఈ వైరస్ పుట్టుకకు కారణం జంతువులేనని చెప్పాలని పేర్కొంది. అయితే ఇది మానవులకు ఎలా సంక్రమించిందనే దానిపై స్పష్టత లేదని, వ్యాప్తికి ఒక జంతువు వాహకంగా వ్యవహరించి ఉంటుందని పునరుద్ఘాటించింది. దీని మూలాలు ఎక్కువగా గబ్బిలాల్లో ఉన్నాయని, వాటి నుంచి మనుషులకు ఎలా వ్యాపించిదనే విషయాన్ని కనుక్కోవాలని డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి ఫడెలా చైబ్‌ తెలిపారు.


By April 22, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/who-warns-worst-is-yet-to-come-icmr-says-india-is-doing-its-best/articleshow/75285822.cms

No comments