Breaking News

కశ్మీర్‌లోకి చొరబాటుకు పీఓకేలో సిద్ధంగా 300 మంది ఉగ్రవాదులు.. సైన్యం అలర్ట్


కశ్మీర్‌లోకి చొరబడేందుకు దాదాపు 300 మంది ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ వెంబడి (పీఓకే)‌లో సిద్ధంగా ఉన్నారని ఆర్మీ నిఘా వర్గాలు సమాచారం అందజేశాయి. దీంతో సరిహద్దుల్లో సైన్యం మరింత ఆప్రమత్తమయ్యింది. గతేడాది ఆగస్టులో కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులు పలుచోట్ల చొరబాట్లుకు చేస్తున్న ప్రయత్నాలను సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోంది. ముఖ్యంగా గత నెల రోజులుగా ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాదికి సైన్యం గట్టిగానే బుద్ధి చెబుతోంది. ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికతో ఎల్‌ఓసీ వెంట పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసినట్టు కశ్మీర్‌లో వ్యూహాత్మక దళాల లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు అన్నారు. ఉగ్రవాదులు కరోనా వైరస్‌ను వ్యాప్తిచేయడానికి ప్రయత్నించే విషయాన్ని కొట్టిపారేయలేమని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 300 మంది ముఖ్యంగా నిషేధిత హిజ్బుల్ ముజాయిద్దీన్, సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆర్మీకి చెందిన హ్యుమింట్ (హ్యూమన్ ఇంటెలిజెన్స్), టెక్ఇంట్ (టెక్నికల్ ఇంటెలిజెన్స్) గుర్తించాయి. తాజాగా వాస్తవాధీన రేఖ వెంబడి 16కుపైగా ఉగ్రవాద శిబిరాలు పాకిస్థాన్ ఆర్మీ, గూఢచార సంస్థ ఐఎస్ఐ సహకారంతో ప్రారంభించినట్టు సమాచారం. ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశించే నౌషేరా, ఛాంబ్ లాంటి క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. చొరబాట్లను తిప్పికొట్టే యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడానికి తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జనరల్ బీఎస్ రాజు అన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రయత్నిస్తుండటంతో సైన్యం తన కొత్త విధానం అవలంభిస్తోంది. నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌ల వల్ల కరోనా వైరస్ బారినపడే అవకాశం ఉన్నందున మృతదేహాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు తెలిపారు.


By April 27, 2020 at 11:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/around-300-terrorists-waiting-across-line-of-control-in-pok-for-intrusion/articleshow/75401040.cms

No comments