దేశంలో 23వేలు దాటిన కోవిడ్ కేసులు.. నిన్న ఒక్కరోజే 1,755 మందికి పాజిటివ్
దేశంలో మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,755 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇక మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే మరో 778 మంది వైరస్ బారినపడ్డారు. దేశంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు పాజిటివ్ కేసుల పెరుగుదల 8.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,113కి చేరింది. మహమ్మారి బారినపడి మొత్తం 721 మంది మృతిచెందారు. గురువారం 43 మంది ప్రాణాలు కోల్పోగా.. అత్యధికంగా మహారాష్ట్ర 14, గుజరాత్ 9, మధ్యప్రదేశ్ 5, ఉత్తరప్రదేశ్ 4, ఆంధ్రప్రదేశ్ 3, ఢిల్లీ 2, తెలంగాణ ఒకరు ఉన్నారు. గ త 24 గంటల్లోగుజరాత్‌లో 217, మధ్యప్రదేశ్ 184, ఢిల్లీలో 125 కేసులు వెలుగుచూశాయి. తొలుత కేరళలో నిర్ధారణ కాగా.. ప్రారంభంలో అక్కడ కేసులు గణనీయంగా పెరిగాయి. అయితే, కేరళ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టి, వైరస్‌ను నియంత్రించింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రారంభమై నెల రోజులు గడచిపోగా.. మహారాష్ట్రలో మహమ్మారి తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతం అక్కడ 6,427 మంది వైరస్ బారినపడగా.. 283 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబయి నగరంలోనే 4వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లో ప్రాణనష్టం అధికంగా ఉంది. ఇప్పటి వరకూ అక్కడ 112 మంది చనిపోయారు. దీని తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (83), ఢిల్లీ (50), రాజస్థాన్ (28), ఆంధ్రప్రదేశ్ (27), తెలంగాణ (25), ఉత్తరప్రదేశ్ (24), తమిళనాడు (20), కర్ణాటక (17), పంజాబ్ (17), పశ్చిమ్ బెంగాల్ (15) ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో వైరస్ కాస్త నెమ్మదించింది. గత నాలుగు రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గుజరాత్‌లో 2,624, ఢిల్లీ 2,376 కేసులు నమోదుకాగా.. రాజస్థాన్ సైతం 2వేల మార్క్‌కు చేరువలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 1,964 మంది వైరస్ బారినపడ్డారు. మధ్యప్రదేశ్ 1,687, తమిళనాడు 1,683, ఉత్తరప్రదేశ్ 1,510 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 893కి చేరింది. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 27కు పెరిగింది. ఒకరోజు వ్యవధిలో ఈ స్థాయిలో రాష్ట్రంలో కేసులు పెరగడం ఇదే తొలిసారి. గతంలో ఒకసారి 75 కేసులు నమోదయ్యాయి. గురువారం ఏకంగా 80 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. తాజాగా కర్నూలు జిల్లాలో 38 మందికి, గుంటూరు జిల్లాలో 18 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ తేలింది. తెలంగాణలో కంటెయిన్‌మెంట్ జోన్ల నుంచి తప్ప కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి కరోనా పాజిటివ్ కేసులు లేవని, మొత్తంగా తగ్గుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం కొత్త కేసులు తగ్గినట్లు కనిపించినా.. గురువారం మళ్లీ పెరిగాయి. కొత్తగా మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ బారినపడి మరొకరు చనిపోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 25కి చేరుకుంది. అసోంలో చాలా రోజుల తర్వాత గురువారం ఒకరికి వైరస్ సోకింది. ఒడిశాలో కేసులు పెరగడంతో బాలాసోర్, భద్రక్, జైపూర్ జిల్లాలను మూడు రోజుల పాటు పూర్తిగా షట్‌డౌన్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. జైపూర్‌లో నాలుగు, బాలాసోర్‌లో రెండు కేసులు కొత్తగా నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒడిశాలో మొత్తం కేసుల సంఖ్య 89కి చేరింది. పశ్చిమ్ బెంగాల్‌లోనూ కేసుల సంఖ్య 456కి, కేరళలో 447, కర్ణాటక 445, జమ్మూ కశ్మీర్ 434, పంజాబ్ 283, హర్యానా 270, బీహార్ 170, ఝార్ఖండ్ 53, ఉత్తరాఖండ్ 47, హిమాచల్‌ప్రదేశ్ 40, అసోం 36, చత్తీస్‌గఢ్ 36, చండీగఢ్ 27, అండమాన్ 22, లడఖ్ 18 కేసులు నమోదయ్యాయి.
By April 24, 2020 at 08:22AM
No comments