Breaking News

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన కేంద్రం


దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వీటి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ప్రాంతాలను గుర్తించి, అక్కడి వారిని ఐసోలేషన్‌కు తరలించి, మరింత వ్యాప్తిచెందకుండా చర్యలు చేపడుతోంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రదేశాల్లో యుద్ధ ప్రాతిపదికన కఠినమైన నియంత్రణ వ్యూహం అమలు చేయనున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రోజూ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని లవ్ అగర్వాల్ సూచించారు. వైద్య నిపుణుల సూచనల ఆధారంగా ప్రభుత్వం అమలుచేస్తున్న మార్గదర్శకాలను 100% అమలుచేయాలని, ఒకవేళ 99 శాతం అమలుచేసినా అనుకున్నది సాధించలేమన్నారు. దేశంలో ఒక జిల్లాలో ఒక వ్యక్తి అమలుచేయకపోయినా మనం మళ్లీ మొదటికొస్తామని అని ఆయన హెచ్చరించారు. అలాగే కరోనా వైరస్ బాధితులకు చికిత్స విషయంలో సమర్ధంగా పనిచేసే హాస్పిటల్స్‌ను గుర్తించే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్రాలను ఆదేశించారు. అలాగే, బాధితులు, ఇతర రోగులతో కలవకుండా హాస్పిటల్స్‌లో చర్యలు తీసుకోవాలని లవ్ అగర్వాల్ తెలిపారు. హాస్పిటల్స్‌లో వెంటిలెటర్లు, ఇతర మౌలిక సదుపాయాలను తక్షణమే మరింత సమర్ధంగా ఏర్పాటయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితుల్ని పర్యవేక్షించడానికి ప్రధానమంత్రి కార్యాలయం 10 ఉన్నతస్థాయి కమిటీలను ఆదివారం నియమించింది. ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, 21 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత ప్రజల కష్టాలను వీలైనంత త్వరగా తగ్గించడమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేస్తాయి. వీటికి ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా మార్గనిర్దేశం చేస్తారు. ‘ఆర్థిక-సంక్షేమ’ కమిటీకి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నేతృత్వం వహిస్తారు. తీవ్రంగా నష్టపోయిన సంఘటిత, అసంఘటిత రంగాలకు ఎలా ఊరటనివ్వాలో ఆ కమిటీ చూస్తుంది. త్వరగా ఆర్థిక రంగాన్ని గట్టెక్కించే మార్గాలను సూచిస్తుంది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, నిరాటంకంగా మందుల సరఫరా, ఆసుపత్రుల లభ్యత వంటివి చూడడానికి రెండు కమిటీలు ఉంటాయి. ఇలా ప్రతి కమిటీలో ఆరుగురు సభ్యులుంటారు. ఆయా రంగాలపై ఏమేం చేయాలో చెప్పడానికి కమిటీలకు వారం రోజులు గడువిచ్చారు.


By March 30, 2020 at 10:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-in-india-centre-identifying-emerging-covid-19-hotspots/articleshow/74883141.cms

No comments