కమాన్ చంద్రబాబూ.. వైసీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాణా కపూర్‌ను ఈడీ అరెస్టు చేసిందన్న ఆయన.. యస్ బ్యాంక్ అక్రమ లావాదేవీల గుట్లన్నీ చేతికి చిక్కాయన్నారు. సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత ముట్టిందనేది కచ్చితంగా బయటపడుతుందని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. తమ దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయేమిటని ఎల్లో మీడియా విలవిల్లాడుతోందంటూ ఆయన సెటైర్లు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. సీఎం జగన్ అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోందన్నారు. ప్రలోభాలను తిరస్కరించి అసాధారణ పరిణితిని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రజానీకం తహతహలాడుతోందన్నారు. కమాన్ చంద్రబాబూ. స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే అంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబు పచ్చ ముఠాకిది ఆఖరు పోరాటం. వైఎస్సార్ కాంగ్రెస్ సైనికులు అప్రమత్తంగా ఉండాలి. సీఎం జగన్ గారిపై బురద చల్లడానికి దేనికైనా తెగిస్తారు. ఎల్లో మీడియా గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తోంది. తనే డబ్బు, మద్యం పంపిణీ చేయించి మన మీదకు నెట్టడానికి కుట్రలు పన్నుతాడు బాబు’’ అని విజయసాయి రెడ్డి విమర్శించారు.
By March 10, 2020 at 12:00PM
No comments