Breaking News

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: ఏపీలో మరో పాజిటివ్ కేసు.. తెలంగాణలో ఉద్ధృతమైన వైరస్


ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ నుంచి మానవాళిని రక్షించడానికి శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. వైరస్‌ను కట్టడిచేసే వ్యాక్సిన్‌ను తయారుచేయడంలో పరిశోధకులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా రూపొందించిన ఓ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 8,960 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 2.19 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మంది మృతిచెందారు. ఒక్క రోజే మరణాల సంఖ్య 12 శాతం నమోదయ్యింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య 170కి చేరింది. తెలంగాణలో బుధవారం ఒక్క రోజే ఎనిమిదికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. వీరిలో ఏడుగురు విదేశీయులు కాగా, ఒకరు తెలంగాణకు చెందిన వ్యక్తి. స్కాట్లాండ్ నుంచి వచ్చి మేడ్చల్ యువకుడితోపాటు ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం సృస్టిస్తోంది. తెలంగాణలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో అటు ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండో కోవిడ్ 19 పాజిటివ్ కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన విదేశీ వ్యక్తుల్లో మొత్తం 8 మందిలో కరోనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జిల్లా ప్రజల్లో కాస్త ఆందోళన కనిపిస్తోంది. కరీంనగర్‌ కేంద్రంతోపాటు ఈ బృందం పర్యటించిన ఇతర ప్రాంతాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. వారు నగరంలో ఉన్న మూడు రోజుల్లో ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో సంచరించారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భూతం.. తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకేసారి 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం (మార్చి 18) రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను పేర్కొంది. రాష్ట్రంలో బుధవారం ఒక్క రోజే 9 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది . ఇరాన్‌లో చిక్కుకున్నవారు సహా ప్రవాస భారతీయుల్లో 276 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 255 మంది ఇరాన్‌లో చిక్కుకున్నవారేనని కేంద్రం తెలిపింది. యూఏఈలో 12 మంది, ఇటలీలో ఐదుగురు, హాంకాంగ్, రువాండా, కువైట్, శ్రీలంకల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇరాన్‌లో దాదాపు 6,000 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిలో 1,100 మందిని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామని పేర్కొంది. ఇప్పటి వరకు 389 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్టు వివరించారు.


By March 19, 2020 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-news-updates-in-andhra-telangana-across-india-and-world/articleshow/74702948.cms

No comments