Breaking News

కేరళ: కరోనాను జయించిన వృద్ధ దంపతులు.. భర్తకు 93, భార్యకు 88 ఏళ్లు!


దేశంలో కేసులు క్రమంగా పెరుగుతుండగా.. బాధితుల్లో 138 మంది కోలుకున్నారు. మహమ్మారిని జయించిన వారిలో కేరళకు చెందిన 93 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్య (88) కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కే కే శైలజ వెల్లడించారు. బాధితులు ఇద్దరికీ డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, ఇతర వయోభార సమస్యలున్నా వైరస్‌ నుంచి కోలుకున్నారని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ వృద్ధ దంపతులు నుంచి కోలుకోవడం శుభపరిణామం. కేరళలోని పథనంతిట్టా జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన థామస్ (93), మరియమ్ (88)ల కుమారుడు, కోడలు, వారి పిల్లలు ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి తిరిగొచ్చారు. అప్పటికే వారు వైరస్‌ బారినపడటంతో ఇతర కుటుంబ సభ్యులకు వ్యాపించింది. వీరికి వైరస్ సోకినట్టు మార్చి 8న నిర్ధారణ అయ్యింది. థామస్ దంపతుల కుటుంబంలోని ఏడుగురు వైరస్‌ బారినపడ్డారు. దీంతో వెంటనే వారందరినీ కొట్టాయం మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ‘చికిత్సలో మొత్తం 40 మందితో కూడిన వైద్య బృందం పాల్గొంది. అయితే, గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో తొలుత థామస్ దంపతుల ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు ఆందోళన చెందారు. కానీ, వైద్యుల సలహాలను తూ.చ. తప్పకుండా పాటించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారు. చికిత్స సమయంలో థామస్‌కు గుండె నొప్పి రావడంతో ఐసీయూలోని వీఐపీ గదికి మార్చారు. భార్యాభర్తలను వేర్వేరు గదులలో ఉంచి చికిత్స చేశారు. థామస్, మరియమ్‌లకు యూరిన్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఉందని’ మంత్రి తెలిపారు. నాలుగు రోజుల కిందట నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. వీరితోపాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా వైరస్‌ నుంచి బయటపడ్డారు. త్వరలో వీరిని డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతోందని, కోవిడ్-19 మరణాల్లో వీరివే ఎక్కువ శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు కోలుకోవడంతో అందరికీ ఆశ కల్పిస్తోంది. వైరస్‌ బారినపడ్డా మానసిక స్థైర్యం కోల్పోకుండా చికిత్సకు సహకరించి, వైద్యుల సలహాలు పాటిస్తే కరోనా నుంచి కోలుకుంటారన్న నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయి. కరోనా అనుమానిత లక్షణాలున్నా, వైరస్‌ సోకిన వారితో కాంటాక్ట్ అయినా స్వచ్ఛందంగా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ఈ దంపతులకు చికిత్సలో పాల్గొన్న ఓ నర్సు దురదృష్టవశాత్తూ వైరస్‌ బారినపడినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు ఐసోలేషన్‌లో చికిత్స కొనసాగుతుండగా.. నర్సు ఆరోగ్య పరిస్థితిపై మంత్రి శైలజ ఆరా తీశారు. నర్సు కోలుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కేరళలో సోమవారం కొత్తగా మరో 32 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కరోనా బారినపడ్డవారి సంఖ్య 234కు చేరింది. వీరిలో ఇద్దరు మరణించగా.. 19 మంది కోలుకున్నారు.


By March 31, 2020 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/oldest-covid-19-patients-aged-93-and-88-make-full-recovery-in-kerala/articleshow/74906045.cms

No comments