Breaking News

కేసులు పెరిగినా.. కోవిడ్ -19 పెరుగుదల రేటు తగ్గుముఖం: కేంద్రం


కరోనా వైరస్‌ను కట్టడిచేయడానికి దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్, ప్రజలు పాటిస్తున్న సామాజిక దూరం ఫలితాన్నిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య తగ్గకపోయినా, పెరుగుదల నిష్పత్తిలో మాత్రం తగ్గుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇలాంటి తరుణంలో ఉదాసీనత ప్రదర్శించకుండా ఆంక్షలన్నింటినీ ప్రజలు యథాతథంగా అనుసరించాలని ఆయన సూచించారు. అలాగే, దేశంలో కరోనా వైరస్‌ సామాజికంగా వ్యాప్తి చెందడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. దేశంలో కొందరికి ఎక్కడి నుంచి సోకిందో తెలియనంత మాత్రాన దాన్ని సామాజిక వ్యాప్తిగా ప్రచారం చేయడం తగదని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ఆంక్షలు, ఆదేశాలను యథావిధిగా అమలు చేయకపోతే వెంటనే సామాజిక వ్యాప్తి మొదలవుతుందని, తు.చ. తప్పకుండా అమలుచేస్తే ఎప్పటికీ ఆ దశకు వెళ్లబోమని ఆయన స్పష్టంచేశారు. ఇంట్లోని పెద్దవాళ్లతో కనీసం మూడు అడుగుల దూరం పాటించాలని ఐసీఎంఆర్ చీఫ్ రమన్‌ ఆర్‌.గంగాఖేడ్కర్‌ అన్నారు. దేశంలోని తీవ్రత, పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ గురువారం సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కేసులు, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి చర్చించారు. హాస్పిటల్స్‌లో సదుపాయాలు, క్యారంటైన్ శిబిరాల అందుబాటు తదితర అంశాలపై రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. లాక్‌డౌన్‌‌ను రాష్ట్రాలు సమర్ధవంతంగా అమలుచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజలు కూడా ఎలాంటి అలసత్వానికి తావులేకుండా సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. మరోవైపు, లాక్‌డౌన్ విధించినప్పటికీ.. కోవిడ్ కేసుల క్రమంగా పెరిగి శుక్రవారం ఉదయానికి దేశంలో వీటి సంఖ్య 700 దాటింది. ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి 20 మంది ప్రాణాలు కోల్పోగా గురువారం అత్యధికంగా ఏడుగురు మృతిచెందారు. దేశంలో కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు మృతిచెందడం ఇదే తొలిసారి.


By March 27, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rate-of-rise-in-coronavirus-positive-cases-relatively-stabilising-says-govt/articleshow/74840597.cms

No comments