Breaking News

దేశంలో 147కి చేరిన కరోనా కేసులు.. మహారాష్ట్రలో అత్యధికంగా 42 మందికి


దేశంలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 24 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 147కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం ఉదయం ఓ ప్రకటన వెలువరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 42 కేసులు నమోదయ్యాయి. పుణేకు చెందిన 28 ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఆమె ఇటీవల ఫ్రాన్స్, నెదర్లాండ్‌లో పర్యటించినట్టు గుర్తించారు. దేశంలో మంగళవారం మూడో కరోనా మరణం చోటుచేసుకున్న సంగతి విదితమే. ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌.. ప్రస్తుతం 164 దేశాలకు వ్యాప్తిచెందింది. దాదాపు 2 లక్షల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్‌లో వైరస్ మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు చైనాలో 3,237 మంది ప్రాణాలు కోల్పోగా, 80,894 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ వైరస్ బారినపడ్డ 82,763 మంది కోలుకున్నారు. మరో 6,415 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐరోపాలోనూ ముఖ్యంగా ఇటలీలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వైరస్ కారణంగా మంగళవారం మరో 345 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 2,503 దాటి, చైనాకు చేరువవుతోంది. కొత్తగా మరో 3,526 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కేసులు 31,500 దాటింది. ఇటలీలో రోమ్‌, మిలాన్‌ సహా పలు నగరాల్లో క్రీడా మైదానాలు మూసివేశారు. డెన్మార్మ్‌ సరిహద్దులు మూసివేసింది. ఇటీవల సౌదీలో జరిగిన జీ20 సన్నాహక సదస్సుకు భారత ప్రతినిధిగా హాజరైన బీజేపీ ఎంపీ సురేశ్‌ ప్రభు స్వీయ నిర్బంధం విధించుకున్నట్లు తెలిపారు. దీంతో 14 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేనని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు ఈమేరకు ఆయన లేఖ రాశారు. సౌదీ అరేబియాలోని అల్‌ ఖోబర్‌లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి హాజరయ్యానని, ముందు జాగ్రత్తగా చేయించుకున్న పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గానే తేలిందని తెలిపారు.


By March 18, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-live-updates-in-andhra-telangana-hyderabad-across-india-news-in-telugu/articleshow/74684650.cms

No comments