Nirbhaya Case: నిర్భయ దోషుల ఉరి ఎప్పుడు? నేడు హైకోర్టు కీలక తీర్పు!
నిర్భయ దోషులను ఉరి తీసేదెప్పుడు..? క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించిన ఇద్దర్నీ పక్కనబెట్టి మిగతా ఇద్దరు దోషులను ముందుగా ఉరి తీస్తారా? లేదంటే అందర్నీ కలిపి ఒకేసారి ఉరి తీస్తారా? ఈ ప్రశ్నలకు నేడు (బుధవారం) ఢిల్లీ హైకోర్టు తీర్పు రూపంలో సమాధానం లభించనుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిర్భయ దోషులను ఉరి తీయొద్దని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ... కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం హైకోర్టు విచారణకు చేపట్టనుంది. నిర్భయ దోషుల్లో ఒకరు రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో.. ఉరి శిక్ష అమలు వాయిదా వేయాలని మిగతా ముగ్గురు దోషులు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ముగ్గుర్ని ఉరి తీయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తిహార్ జైలు అధికారులు చెప్పగా.. జైలు నిబంధనల ప్రకారం ఓ కేసులో దోషులుగా తేలిన వారందర్నీ ఒకేసారి ఉరి తీయాలని దోషుల తరఫు లాయర్ వాదించారు. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఉరి అమలుకు బ్రేకులేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఉరి తీయొద్దని తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉండగా.. జనవరి 31న సాయంత్రం సమయంలో ఈ తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 1న వినయ్ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. కానీ అదే రోజు నిర్భయ కేసులో మరో దోషిగా ఉన్న అక్షయ్ థాకూర్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడు. నలుగురు నిర్భయ దోషుల్లో ఇక మరొకరు మాత్రమే క్షమాభిక్ష కోరాల్సి ఉంది. ఒకరి తర్వాత మరొకరు క్షమాభిక్ష కోరుతుండటం పట్ల కేంద్రం ఆగ్రహంతో ఉంది. నిర్భయ దోషులు దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
By February 05, 2020 at 09:06AM
No comments