Breaking News

Coronavirus భారత్‌లో రెండో కేసు.. 304కి చేరిన మృతులు


ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వ్యాపిస్తోంది. తాజాగా వైరస్‌కు సంబంధించి రెండో కేసు నమోదైంది. ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నామని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ సోకిన బాధితుడు ఇటీవల చైనాలో పర్యటించినట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం కేరళలోనే తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఈ విద్యార్ధిని చైనాలోని వుహాన్‌ నగరంలో విద్యాభ్యాసం చేస్తోంది. వైరస్‌ తీవ్రతకు భయపడి ఆ విద్యార్ధిని స్వస్థలానికి చేరుకోగా, ఆమె రక్త నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకిన విషయం బయటపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజా కేసుతో ఇప్పటి వరకు భారత్‌లో ఇద్దరు ఈ వైరస్ బారిన పడ్డట్లు ధ్రువీకరించారు. మరోవైపు, చైనాలో స్వైరవిహారం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 304కు చేరుకోగా, 14వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 45 మంది చనిపోగా, కొత్తగా మరో 2,590 మంది కరోనా బారినపడినట్టు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. మొత్తం 14,380 కరోనా వైరస్ కేసులు నమోదుకావడంతో 2003లో సార్స్ వైరస్ సోకినవారి కంటే ఇది అధికం. హుబే ప్రావిన్సుల్లోని హౌవున్‌గాగ్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని చైనా అధికార పత్రికే పెదవి విరించింది. రోగులకు అవసరమైన ఔషధాలు, మెడికల్ మాస్క్‌లు అందుబాటులో లేవని ఆ నగర మేయర్ ప్రకటించారు. స్వదేశంలో ప్రజా రవాణను నిలిపివేసి, ప్రయాణాలపై ఆంక్షలు విధించినప్పటికీ, గత రెండు వారాల్లో చైనాను సందర్శించిన చాలా మంది విదేశీయులను తమ దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా నిషేధం విధించింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా, జపాన్, సింగ్‌పూర్ సైతం అమెరికానే అనుసరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చైనా మరింత అప్రమత్తమైంది. భారత్, దక్షిణ కొరియాలు తమ పౌరులను స్వదేశానికి తరలిస్తున్నాయి.


By February 02, 2020 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indias-second-coronavirus-case-in-kerala-chinas-death-toll-to-304/articleshow/73863639.cms

No comments