ఆ పద్ధతులతో కరోనా వైరస్ చావదు.. డబ్లూహెచ్ఓ వెల్లడి
కరోనా వైరస్‌ను నిరోధించేందుకు కొన్ని సాంప్రదాయ విధానాలు పని చేస్తాయనే వార్తలు ప్రచారంలో ఉన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దీనిపై స్పష్టతనిచ్చింది. వెల్లుల్లి రసం, నువ్వుల నూనె వంటి వాటితో కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని పుకార్లు వస్తున్న నేపథ్యంలో వీటిని ఖండించింది. కరోనా వైరస్ నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రాంతాలను బట్టి వేర్వేరుగా పుకార్లు కూడా పుట్టుకొస్తున్నాయి. భారత్‌లో వెల్లుల్లి రసం, నువ్వుల నూనె, మౌత్ వాష్‌ల వల్ల కరోనా తగ్గుతుందంటూ పుకార్లు వ్యాప్తి చెందాయి. నువ్వుల నూనెను శరీరంపై రాసుకుంటే కరోనా వైరస్ దరి చేరదనేది అపోహేనని, కొన్ని రకాల విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల కూడా బారి నుంచి తప్పించుకోలేమనే వాదన కూడా సరికాదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని.. మౌత్ వాష్ నోటికి తాజాదనం ఇస్తుందని.. అంతేగానీ ఇవి కరోనావైరస్ నుంచి రక్షించవని డబ్ల్యూహెచ్ఓ ఓ వెబ్‌సైట్లో పేర్కొంది. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి రక్షించే కచ్చితమైన మందు ఏదీ కనుగొనలేదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ప్రస్తుతం చికిత్సలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలకు డబ్ల్యూహెచ్ఓ కూడా తమవంతు సహకారం అందిస్తోంది. కరోనా చికిత్సలపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
By February 07, 2020 at 09:25AM
No comments