Breaking News

కశ్మీర్, సీఏఏపై వ్యాఖ్యలు.. భారత్ చర్యలతో వెనక్కుతగ్గిన మలేషియా ప్రధాని


కశ్మీర్ అంశం, పౌరసత్వ సవరణ చట్టంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి మలేసియా ప్రధాన మంత్రి మహతిర్ మహమ్మద్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను పూర్తిగా తప్పుబట్టిన భారత్.. పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో విదేశాంగ శాఖ మరోసారి ప్రస్తావిస్తూ... ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని, వీటిపై వ్యాఖ్యలు చేసే అధికారం మలేషియా, పాకిస్థాన్‌లకు లేవని స్పష్టం చేసింది. అంతేకాదు, భారత సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమైక్యతను గౌరవించి, ఈ అంశాలను అవగాహన చేసుకోవాలని హితవు పలికింది. దీని ప్రభావం భారత దేశంలోని ఏ పౌరుని హోదాపైనా ఉండబోదని స్పష్టం చేసింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ మలేషియా పర్యటన ముగింపు సందర్భంగా మహతీర్ మహమ్మద్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మహతీర్‌తో చర్చల సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ఇమ్రాన్ లేవనెత్తినట్టు మలేషియా పేర్కొంది. అయితే, దీనిపై ఇరువర్గాలు అంగీకరించినట్లు ప్రకటనలో మాత్రం పేర్కొనలేదు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేస్తూ 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని, ఏకపక్ష చర్యలని మలేషియా ప్రధానికి ఇమ్రాన్ వివరించారు. దీంతో కశ్మీర్, సీఏఏలపై మహతీర్ స్పందించి ఉండవచ్చని భారత్ అభిప్రాయపడింది. వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులపై నిషేధం విధించింది. దీనిపై స్పందించిన మహతీర్.. ఆశ్చర్యకరంగా తాను భారత్‌పై ప్రతీకారం తీర్చుకోనని తెలియజేశాడు. అంతేకాదు, భారతదేశం నుంచి చక్కెర దిగుమతులను కూడా మలేషియా పెంచింది. మలేషియా నుంచి దిగుమతులు నిషేధించడంపై లోక్‌సభలో ఓ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ.. , సీఏఏ తమ అంతర్గత వ్యవహారమని అంతర్జాతీయ సమాజానికి పలు సందర్భాల్లో వివరించినట్టు తెలిపింది. గత సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో కశ్మీర్ అంశంపై మలేషియా ప్రధాని మాట్లాడుతూ.. కశ్మీర్‌ను భారత్ బలవంతంగా ఆక్రమించుకుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా మహతీర్ వెనక్కు తగ్గలేదు. దీంతో ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులను నిషేధించి, ప్రతీకారం తీర్చుకుంది. పామాయిల్ ఉత్పత్తులను భారత్ నిషేధించినా తాము కొనుగోలుచేస్తామని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు. కానీ, అధికారిక లెక్కల ప్రకారం.. మలేషియా నుంచి భారత్ 4.4 మిలియన్ టన్నుల ఆయిల్ పామ్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుండగా, పాక్ కేవలం ఒక మిలియన్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తోంది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఇస్లామిక్ దేశాల సమాఖ్య సదస్సులో మలేసియా ప్రధాని మాట్లాడుతూ.. భారతీయులు 70 సంవత్సరాలపాటు కలిసికట్టుగా ఉన్న తర్వాత పౌరసత్వ సవరణ చట్టం అవసరం ఏమిటని ప్రశ్నించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ‘లౌకిక దేశమని చెప్పుకుంటున్న భారత దేశం కొందరు ముస్లింల పౌరసత్వాన్ని పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. చాలా విచారకరం.’’ అని మహతిర్ చెప్పినట్లు మీడియా పేర్కొంది.


By February 06, 2020 at 11:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/is-pakistan-malaysia-joint-statement-on-kashmir-and-caa-a-sign-of-mahathir-climbdown/articleshow/73976521.cms

No comments