Breaking News

ఖర్చులు తగ్గించుకోండి, చౌకగా విద్యుత్ కొనండి.. డిస్కంలకు జగన్ ఆదేశాలకు


సాధ్యమైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ధరకు విద్యుత్‌ను ఆఫర్ చేసే సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఇలా చేయడం వల్ల నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. హైడ్రో రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుల మీద కచ్చితంగా శ్రద్ధ పెట్టాలని ఆయన డిస్కంలకు సూచించారు. టీడీపీ హయాంలో ఎక్కువ ఖర్చుకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల జెన్కో, డిస్కంలు అప్పుల పాలయ్యాయన్నారు. ఐదేళ్లలో డిస్కంలు తిరిగి పుంజుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్యాంప్ ఆఫీసులో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చౌక ధరలకు విద్యుత్‌ను విక్రయించే సౌర, పవన్ విద్యుత్ సంస్థలను ప్రోత్సహించాలని.. దీని వల్ల డిస్కంలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ రంగంలో పని చేసే సిబ్బందికి అత్యుత్తమ స్థాయి శిక్షణ ఇవ్వాలని, వారి నైపుణ్యం పెంపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్రిష్ణపట్నం, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లలో కొత్త యూనిట్లను ఏర్పాటును వేగవంతం చేయాలని జగన్ ఆదేశించారు. ఏపీకి చెందిన విద్యుత్ సంస్థలు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించే స్థాయిలో ఉండాలన్నారు. ఈ సమావేశంలో సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


By February 20, 2020 at 11:47AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-cm-ys-jagan-conducts-review-meeting-with-energy-dept-ask-dicoms-to-scout-for-low-cost-power/articleshow/74220893.cms

No comments