Breaking News

‘గోదావరి సాక్షి’గా.. జగన్ సర్కారుపై అదిరిపోయేలా నిరసన!


ఏపీ సీఎం శనివారం రాజమండ్రిలో దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దిశా చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు.. మహిళలపై నేరాలను అరికట్టడం కోసం దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. అనంతరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో దిశా యాప్‌ను ప్రారంభించారు. దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు.. విశాఖ, తిరుపతిలో కొత్తగా డీఎన్‌ఏ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 13 జిల్లాల్లో ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా సీఎం జగన్ రాజమండ్రి పర్యటన వార్తల కవరేజీకి స్థానికంగా ఉండే చిన్న పత్రికలకు అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ‘గోదావరి సాక్షి’, ‘నేటితరం సూర్య’ లాంటి స్థానిక సాయంకాల దినపత్రికలు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశాయి. ‘పాఠకులకు గమనిక ముఖ్యమంత్రి రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా వార్తలను కవరేజ్ చేయడానికి స్థానిక పత్రికలకు అనుమతి నిరాకరించిన కారణంగా ఆ వార్తా విశేషాలను పాఠకులకు అందించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం’ అంటూ ఎడిటర్/పబ్లిషర్ పేరిట గోదావరి సాక్షి పత్రిక ఓ ప్రకటనను విడుదల చేసింది. రాజమండ్రి నుంచి వెలువడే నేటితరం సాక్షి అనే సాయంకాలం పత్రికైతే.. జగన్ సర్కారు వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ‘‘రాష్ట్రం జగన్ జాగీరు కాదు - ‘జిల్లా’ కలెక్టర్ గారి ఎస్టేటూ కాదు’’ అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రజాస్వామ్యమే రాజకీయ పార్టీలను, నేతలను బతికిస్తోందని... ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతగా అణచివేతకు ప్రయత్నించినా ప్రజాస్వామ్యం కారణంగానే దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ ఎందరో అధికారాన్ని అందుకున్నారని.. అలాంటి వారిలో అగ్రగణ్యుడు జగన్ అని ఆ కథనంలో పేర్కొన్నారు. ఏ పత్రికా స్వేచ్ఛ వల్ల తమ వాదనలు ప్రజల్లోకి వెళ్లాయో.. ఆ పత్రికలే పాలన చేపట్టాక కొరగానివిగా కనిపిస్తున్నాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సీఎం జగన్ రాజమండ్రి పర్యటన సందర్భంగా ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకే కవరేజీకి అనుమతి ఇచ్చారని.. ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆ కథనంలో పేర్కొన్నారు. పాదయాత్రతో చేరువైన ప్రజానేత వస్తుంటే ఇంతటి కర్ఫ్యూ వాతావరణం అవసరమా? ఇవన్నీ నేతను ప్రజలకు దగ్గర చేస్తాయా? దూరం చేస్తాయా? అని ప్రశ్నించారు. మీడియాకు అనుమతి లేకపోవడానికి సీఎం జగన్, జిల్లా కలెక్టర్ ఇద్దరూ నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణలో కూర్చొని దేశ రక్షణ రహస్యాలను చర్చించుకోలేదుగా అని సదరు కథనంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.


By February 09, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/local-media-allegedly-not-given-permission-to-cover-cm-ys-jagan-rajahmundry-tour/articleshow/74038532.cms

No comments