షాపింగ్ మాల్‌లో సైనికుడి కాల్పులు.. 21 మంది మృతి, 40 మందికిపైగా గాయాలు
థాయ్‌లాండ్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో సైనికుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో 21 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికిపైగా గాయపడ్డారు. నఖోన్ రట్చసిమా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నగరాన్నే కోరట్ అని కూడా పిలుస్తారు. శనివారం తన కమాండింగ్ ఆఫీసర్‌ను చంపేసిన జక్రపంత్ థోమ్మా అనే సైనికుడు.. అనంతరం మిలటరీ క్యాంపు నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లాడని తెలుస్తోంది. ఆ ఆయుధాలతోనే ఓ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో సదరు సైనికుడు షాపింగ్ మాల్‌లో కాల్పులు ప్రారంభించాడు. కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించారు. సైనికుడి కాల్పుల్లో ఒక భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయపడ్డారు. కాల్పులకు తెగబడ్డ సైనికుడు భవనం వెనుక వైపు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అతణ్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని అదుపులో తీసుకునే ప్రయత్నాల్లో భాగంగా.. అనుమానితుడి తల్లిని కూడా భద్రతా సిబ్బంది షాపింగ్ మాల్‌కు తీసుకొచ్చారు. కానీ ఉపయోగం లేకపోయింది. ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడంతో భవనంలో ఉన్నవారిలో కొందరు బాత్‌రూమ్‌లలో, రెస్టారెంట్ టేబుళ్ల కింద దాక్కొని ప్రాణాలను కాపాడుకున్నారు. కాల్పులకు తెగడబడుతున్న సమయంలో తాను లొంగిపోవాలా? అని సదరు సైనికుడు ఫేస్‌బుక్‌లో తోటి నెటిజన్లను అడగటం గమనార్హం. అంతకు ముందు అతడు సోషల్ మీడియాలో పిస్టల్, మూడు సెట్ల బుల్లెట్ల ఫొటోలను పోస్టు చేశాడు. ‘ఇట్ ఈజ్ టైమ్ గెట్ ఎగ్జయిటెడ్’, ‘నోబడీ కెన్ అవాయిడ్ డెత్’ అనే కామెంట్లను పోస్టు చేశాడు.
By February 09, 2020 at 08:50AM
No comments