Breaking News

చైనా: 2,112కి చేరిన కోవిడ్ మృతులు.. అనూహ్యంగా తగ్గిన కొత్త కేసులు


చైనాలోని హుబే ప్రావిన్సుల్లో కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,112కి చేరింది. కోవిడ్ వల్ల బుధవారం మరో 108 మంది మృతిచెందారు. ఇక, కొత్తగా వైరస్ సోకినవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గడచిన వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బాధితుల సంఖ్య బుధవారం మరింత తగ్గింది. కేవలం 349 కేసులు మాత్రమే నమోదయినట్టు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 74,534కి చేరినట్టు తెలిపింది. కరోనా వైరస్ తొలిసారి బయటపడ్డ వుహాన్ నగరంలోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. ఈ నగరంలోనే ఏకంగా 2,100 మంది మృత్యువాతపడ్డారు. అటు దక్షిణ కొరియాలో మరో 31 మంది కొత్తగా కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 82కి చేరింది. రాజధాని నగరం సియోల్‌లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. మిగతా బాధితులు యాంగ్‌బుక్ ప్రావిన్సులకు చెందినవారేనని దక్షిణ కొరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ పేర్కొంది. డైమండ్ ప్రిన్సెస్ నౌకలోని మొత్తం 600 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఈ నౌకలోని తమ పౌరులను ఆస్ట్రేలియా స్వదేశానికి తరలించింది. తొ లి విడతగా 180 మంది ఆస్ట్రేలియా పౌరులు డార్విన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిని రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తారు. వీరి నమూనాల్లో కరోనా వైరస్ నిర్ధారణ కాకపోతే స్వస్థలాలకు తరలిస్తారు. పాజిటివ్ వచ్చినవారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందజేస్తారు. డైమండ్ ప్రిన్సెస్‌లోని మరో 600 మందితో కూడిన రెండో బృందం గురువారం నౌక నుంచి బయటకు రానుంది. కరోనా వైరస్ లక్షణాలు బయటపడిన ఇద్దరు ఇరాన్ పౌరులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరి నమూనాల్లో వైరస్ నిర్ధారణ కావడంతో క్యోమ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స అందజేశారు. తమ పౌరుల మృతిపై ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటన వెల్లడించారు. వయసు పైబడటం, రోగనిరోధక వ్యవస్థ చెడిపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు మృతిచెందినట్టు తెలిపారు. కాగా, ముగ్గురు వాల్ స్ట్రీట్ జర్నల్ విలేకరులను చైనా బహిష్కరించడాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛను చైనా గౌరవించాలని ఆయన కోరారు. పరిపక్వత, బాధ్యతాయుతమైన దేశాలు పత్రికా స్వేచ్ఛను అవగాహన చేసుకోవాలి.. తమ భావాలు, వాస్తవాలను వ్యక్తం చేసే పత్రికలకు వాదనల ద్వారా సరైన కౌంటర్ ఇవ్వాలి గానీ, వాటిని కట్టడి చేయడం తగదని పాంపియో హితవు పలికారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ తన సంపాదకీయంలో ‘రియల్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆసియా’ పేరుతో గతవారం ఓ కథనం ప్రచురించింది. దీనిపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పత్రిక జర్నలిస్ట్‌లను తమ దేశం నుంచి బహిష్కరించింది.


By February 20, 2020 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-hubei-reports-another-108-deaths-349-new-cases-confirms-in-wuhan/articleshow/74218771.cms

No comments