Breaking News

కశ్మీర్‌లో కలకలం: ఉగ్రవాదులతో కలిసి ఒకే కారులో డీఎస్పీ.. అరెస్ట్


జమ్మూ కశ్మీర్‌లో ఓ డీఎస్పీ సహా ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుల్గామ్ జిల్లా శనివారం మధ్యాహ్నం ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో ప్రయాణిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖాజీగండ్‌లోని మీర్ బజార్ వద్ద హిజ్బుల్ ముజాయిద్దీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో ఉండగా డీఎస్పీ దవీందర్ సింగ్‌ను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ దవీందర్ గతేడాది ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌ను అందుకోవడం విశేషం. దక్షిణ కశ్మీర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అతుల్ గోయల్ నేతృత్వంలోని పోలీస్ బృందం వీరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఉగ్రవాదులను నవీద్ బాబు, అసిఫ్ రథేర్‌గా గుర్తించారు. నవీద్ హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కీలక కమాండర్‌ కాగా, రథేర్ కూడా వాంటెండ్ ఉగ్రవాది. ఇతడు మూడేళ్ల కిందట హిజ్బుల్ ముజాయిద్దీన్‌లో చేరాడు. ఇరువురూ సోఫియాన్‌కు చెందినవారిగా పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు ఏకే 47 తుపాకులు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్ పోలీస్‌కు చెందిన యాంటీ-హైజాకింగ్ విభాగంలో పనిచేస్తుండగా, ప్రస్తుతం శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌లో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న దేవేందర్.. ఎస్ఓజీలో ఉన్నప్పుడు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లలో కీలక పాత్ర పోషించారు. ఉగ్రవాదులతో పోరాటాలలో ఆయన పనితీరుకు ప్రశంసలు లభించడమే కాదు డీఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. అయితే, ఆయనపై ఆరోపణలు రావడంతో ఎస్‌ఓజీ నుంచి తొలగించి కొన్నాళ్లు విధుల నుంచి తప్పించారు. సస్పెన్షన్ అనంతరం ఆయనను శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బదిలీచేశారు. గతేడాది నుంచి శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ యాంటీ హైజాకింగ్ టీమ్‌లో కొనసాగుతున్నారు. ఉగ్రవాదులతో పట్టుబడిన తర్వాత దవీందర్ సింగ్ నివాసంలో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి, ఒక ఏకే 47 రైఫిల్, రెండు తుపాకులు, మూడు గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారని నిఘా వర్గాల తెలిపాయి. శ్రీనగర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే శివ్‌పొర‌లోని దేవేందర్ కుటుంబం ఉంటోంది. దీనికి సమీపంలోనే బదామీబాగ్ ఆర్మీ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. మరోవైపు, పుల్వామాలోని ఆయన స్వస్థలంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూలో పర్యటించాలనే సాకుతో శనివారం నుంచి నాలుగు రోజుల సెలవులకు వెళ్లిన డీఎస్పీ దేవేందర్.. కుల్గామ్ వద్ద పట్టుబడ్డాడు. ఇక, 2001 పార్లమెంటు దాడి కేసులోనూ దేవీందర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రధాన నిందితుడు ఆఫ్జల్ గురు తీహార్ జైల్లో ఉన్నప్పుడు తన లాయర్‌కు లేఖ రాస్తూ.. బుద్గామ్‌లోని హుమహామా డీఎస్పీ దేవేందర్ సింగ్ తనను దాడికి ఉసిగొల్పినట్టు తెలిపారు. అంతేకాదు, దాడిలో పాల్గొన్న మహమ్మద్‌ను ఆయనే ఢిల్లీకి తీసుకొచ్చి, అద్దె ఇంట్లో ఉంచాడని ఆరోపించాడు. అతడి కోసం ఓ కారును కూడా కొన్నట్టు తన లేఖలో వివరించాడు. ఇక, హిజ్బుల్ ముజాయిద్దీన్ కమాండర్ నవీద్ సైతం మాజీ పోలీస్ ఉద్యోగి కావడం గమనార్హం. బుద్గామ్‌లోని ఫుడ్ అండ్ సప్లయ్ విభాగం స్టోర్ వద్ద 2017 వరకు భద్రత విధులు నిర్వహించాడు. తర్వాత మే 2017లో ఏకే 47 రైఫిల్‌తో పరారై హిజ్బుల్ ముజాయిద్ధీన్ ఉగ్రవాదిగా మారాడు.


By January 12, 2020 at 10:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jammu-and-kashmir-dsp-arrested-with-two-hizbul-terrorists-in-kulgam/articleshow/73210714.cms

No comments