స్వామి వివేకానందుడికి ప్రధాని మోదీ నివాళి.. పౌరసత్వ చట్టంపై కీలక వ్యాఖ్యలు
రెండ్రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. సందర్భంగా ఆదివారం ఉదయం బేలూరు మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వివేకానందుడికి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో, మెదళ్లలో ఉన్నారని.. ముఖ్యంగా భారతీయ యువత గుండెల్లో ఉన్నారన్న మోదీ.. వివేకానందుడు యువతకు గొప్ప విజన్‌ను అందించారన్నారు. జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకొనే వివేకానందుడి జయంతి రోజున తాను బేలూరు మఠంలో ఉన్నానని.. స్వామి వివేకానంద ధ్యానం చేసుకున్న గదిలోకి వెళ్లానని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ పరమహంసకు కూడా మోదీ నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లోనూ తెలివైన వారు ఉన్నారన్న మోదీ.. పౌరసత్వ చట్టంలో ఏముందో అర్థం చేసుకోవాలని వారు కోరుకోవడం లేదన్నారు. ఈ చట్టం ద్వారా తాము ఎవరి పౌరసత్వాన్ని లాగేసుకోవడం లేదని స్పష్టం చేశారు. మతం వల్ల పాకిస్థాన్‌లో దాడులకు గురైన వారికి భారత పౌరసత్వం కల్పించాలని మహాత్మా గాంధీ, ఇతర నేతలు చెప్పారన్న ప్రధాని.. అలాంటి వారు హత్యకు గురవడం కోసం తిరిగి వెనక్కి పంపాలా? అని ప్రశ్నించారు. రాజకీయ కారణాల వల్ల చాలా మంది రూమర్లను వ్యాపింపజేస్తున్నారన్న మోదీ.. వీటిని తిప్పికొట్టడానికి యువత సాయం చేస్తుండటం ఆనందాన్ని ఇస్తోందన్నారు. 70 ఏళ్లుగా మైనార్టీలపై చేస్తున్న అఘాయిత్యాలకు పాకిస్థాన్ సమాధానం చెప్పాలని మోదీ డిమాండ్ చేశారు.
By January 12, 2020 at 10:36AM
No comments