మన కళాకారులకు ‘పద్మ శ్రీ’.. యడ్ల గోపాలరావు, దళవాయి చలపతి రావు వివరాలివే..

ఏపీకి చెందిన ఇద్దరికి కేంద్రం పురస్కారాలను ప్రకటించింది. , పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో చలపతిరావు అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు. ఆయన పదేళ్ల వయసులో తోలుబొమ్మలాట ప్రారంభించారు. ఆరు దశాబ్దాలుగా తోలుబొమ్మల తయారీ, తోలుబొమ్మల ప్రదర్శనలో ఆయన నిమగ్నమయ్యారు. 1988లో జాతీయ అవార్డు అందుకున్న ఆయన.. 2016లో కళారత్న పురస్కారానికి ఎంపికయ్యారు. తొలుబొమ్మల తయారీ, ప్రదర్శనలో యువతకు ఆయన శిక్షణనిస్తున్నారు. పద్మ శ్రీ పురస్కారం రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన మరో ఆంధ్రుడు యడ్ల గోపాలరావు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడకు చెందిన ఆయన నాటక రంగ కళాకారుడు. 12 ఏళ్ల నుంచే నాటక రంగం పట్ల ఆకర్షితులయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపాలరావు.. గురువు యడ్ల సత్యం నాయుడు ప్రోత్సాహంతో కళారంగంలో అడుగు పెట్టారు. సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడి పాత్రను పోషించి.. అందరి మెప్పు పొందారు. గత 55 ఏళ్లుగా నాటక రంగానికి ఆయన సేవలు అందిస్తున్నారు. తొలుత సాంఘిక నాటకాల్లో నటించిన ఆయన.. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. రవీంద్రభారతి లాంటి వేదికలపై సన్మానాలు పొందడంతోపాటు.. అక్కినేని, తనికెళ్ల భరణి లాంటి ప్రముఖ నటుల చేతుల మీదుగా సత్కారాలు అందుకున్నారు. పౌరాణిక నటులతో కలిసి సత్య హరిశ్చంద్ర నాటకాన్ని సినిమాగా తీశారు. ఇప్పటి వరకూ 5 వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.
By January 26, 2020 at 09:16AM
No comments