రాంగ్ రూట్లో పోలీసు వాహనం.. భారీ జరిమానా; మూడు రోజుల్లో రెండు ఘటనలు
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన పోలీసు వాహనానికి రాచకొండ పోలీసులు జరిమానా విధించారు. ఉప్పల్ రింగ్ సమీపంలో ఓ పోలీసు వాహనం రాంగ్ రూట్లో ప్రయాణించింది. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందించిన రాచకొండ పోలీసులు సదరు వాహనంపై రూ.1100 జరిమానా విధించారు. యూజర్ ఛార్జీలతో కలిపి రూ.1135 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల సమయంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన TS 09 PA 4083 వాహనానికి జరిమానా విధించామని పోలీసులు తెలిపారు. అంతకు రెండు రోజుల ముందు సిద్ధిపేట ట్రాఫిక్ పోలీసులు కూడా రాంగ్ రూట్లో వెళ్లిన పోలీసు వాహనంపై రూ.1100 జరిమానా విధించారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫొటోను పోస్టు చేయగా.. అది వైరల్ అయ్యింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిద్ధిపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా.. భక్తులు దర్శనం చేసుకునేలా పర్యవేక్షించే బాధ్యతలను సిద్ధిపేట సీపీ జోయెల్ డేవిస్.. ఎస్సై మిరుదొడ్డి శ్రీనివాస్‌కు అప్పగించారు. ఎస్సైను వాహనంలో ఆలయం వద్ద దింపేసిన డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో ఉంచగా.. కాసేపట్లో అది వైరల్ అయ్యింది. కమిషనర్ ఆదేశాల మేరకు సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ సదరు వాహనానికి రూ.1100 జరిమానా విధించారు.
By January 10, 2020 at 11:16AM
No comments