‘అల వైకుంఠపురంలో’: అక్కడ కలెక్షన్లలో ‘సరిలేరు నీకెవ్వరు’ను బీట్ చేసేసింది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తమ రివ్యూలను ఇచ్చేస్తున్నారు. త్రివిక్రమ్, బన్నీ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారని అంటున్నారు. అయితే అమెరికా, న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా రచ్చ పుట్టించేస్తోందట. ఆ రెండు దేశాల్లో నిన్ననే ప్రీమియర్ షోలు పడ్డాయ్. అమెరికాలో ‘అల వైకుంఠపురంలో’ ప్రీమియర్‌కి 590,216 డాలర్ల వసూళ్లు వచ్చినట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్విటర్ వేదికగా వెల్లడించారు. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు అమెరికాలో తొలిరోజు కలెక్షన్లు 417,559 డాలర్లు రాబట్టాయి. ఈ రకంగా చూసుకుంటే అమెరికాలో ‘అల వైకుంఠపురంలో’ ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో ‘అల వైకుంఠపురంలో’ రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని రమేష్ బాలా అభిప్రాయపడ్డారు. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టాయి. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో కూడా ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు మంచి స్పందన వస్తోందట. చూడబోతే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో త్రివిక్రమ్, బన్నీ ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టేశారనే చెప్పాలి.
By January 12, 2020 at 10:17AM
No comments