Breaking News

`వెండితెర వేల్పు.. పేద ప్రజల దైవం` అన్న ఎన్టీఆర్


పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర దేవుడిగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న ఒకే ఒక్క నటుడు . కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయనాయకునిగా తెలుగు సినీ ప్రతిష్ఠని, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగ పురుషుడు ఆయన. నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. ఎన్టీఆర్‌కు ముందుగా కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి భావించిందట, కానీ మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. విజయవాడ మున్సిపల్‌ హైస్కూలులో ప్రైమరీ ఎడ్యూకేషన్‌ పూర్తి చేసిన , తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1942 మేలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్‌. నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ లాంటి వారితో కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. చదువు తరువాత సబ్‌రిజిస్టార్‌గా ఉద్యోగం వచ్చినా.. నటన మీద ఉన్నమక్కువతో అక్కడ ఎక్కువ రోజులు ఇమడలేకపోయారు ఎన్టీఆర్‌.. ప్రముఖ నిర్మాత బి ఎ సుబ్బారావుగారి సహకారంతో ఎల్వీ ప్రసాద్‌ను కలిసిన ఆయన, పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపికయ్యారు. కాని కొన్ని కారణాలతో ఆ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవ్వటంతో మొదట మనదేశం సినిమాతో కెమరా ముందుకు వచ్చారు ఎన్టీఆర్‌. తరువాత పల్లెటూరి పిల్ల, షావుకారు సినిమాల్లో నటించి మెప్పించారు ఎన్.టి.ఆర్. ఆ తర్వాత వచ్చిందే పాతాళభైరవి . ఈ సినిమా ఎన్టీఆర్‌కు స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. తరువాత మళ్లీశ్వరి, పెళ్ళి చేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్.టి.ఆర్.లోని నటుడిని తెర ఎత్తు రూపంగా ఆవిష్కరించాయి. ఎన్టీఆర్‌ సినీ ప్రయాణంలో మరో కళికితురాయి మాయాబజార్‌. కృష్ణుడిగా ఎన్టీఆర్‌ను చూస్తారా అన్న జనాలతో కృష్ణుడంటే ఎన్టీఆరే అనే అని అనిపించుకున్నారు. కృష్టుడిగా ఎన్టీఆర్‌ తెర మీద కనిపిస్తుంటే జనాలు థియేటర్లలోనే హారతులు పట్టేవారంటే ఆయన నటన ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. పౌరాణికలు, జానపదాలలో ఏ స్థాయిలో అలరించాడో.. కమర్షియల్‌ ఫార్ములా సినిమాల్లోనూ అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు. సర్దార్ పాపారాయుడు, బెబ్బులి పులి, జస్టిస్‌ చౌదరి లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ నటన ఎప్పటికీ మరిచిపోలేం. హీరోగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు ఎన్టీఆర్‌. దానవీర శూర కర్ణ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించడమే కాదు ఆ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో కనిపించారు. కథానాయకుడిగా తనను ఎంతో కీర్తి ప్రతిష్టలను అందించిన ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానమే కాదు రాజకీయ ప్రస్థానం కూడా ఓ సంచలనమే. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పీటాన్ని కదిలించిన తొలి వ్యక్తి ఎన్టీఆర్. ముఖ్యమంత్రిగా రెండు రూపాయల కిలో బియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, వ్యవసాయ రంగానికి సబ్సిడీలు, మహిళలకు ఆస్తి హక్కు లాంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో అధికారం కోల్పోయిన ఎన్టీఆర్‌ 1996 జనవరి 18న గుండెపోటుతో మరణించారు. భౌతికంగా ఆయన దూరమైనా ప్రజలు, అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.


By January 18, 2020 at 01:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-ntr-death-anniversary-special-article/articleshow/73352711.cms

No comments