ఒమన్ సుల్తాన్ కన్నుమూత.. 50 ఏళ్ల పాలనలో దేశాన్ని ఆధునికతవైపు నడిపించిన నేత!
పశ్చిమాసియా దేశాల్లో సుదీర్ఘ కాలం పరిపాలించిన నేతగా గుర్తింపు పొందిన ఖబూస్ బిన్ సయిద్ అల్ సయిద్ (79) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అధికారిక మీడియా ప్రకటించింది. తన తండ్రి మరణం తర్వాత 1970లో బ్రిటన్ సహకారంతో సుల్తాన్‌గా ఖబూస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి 2020 జనవరి 10 వరకు సుల్తాన్‌గా కొనసాగారు. బిన్ విదేశాంగ విధానం ఒమన్‌ను ఆధునికత వైపు నడిపించింది. ఇదే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఇక, 2016 నాటి అమెరికా, ఇరాన్ అణు ఒప్పందంలో ఖబూస్ కీలక పాత్ర పోషించారు. ఇరుపక్షాలకు మధ్యవర్తిగా వ్యవహరించడంతో గల్ఫ్ దేశాల్లో ఒమన్‌కి ప్రాధాన్యత పెరిగింది. సుల్తాన్ మృతికి ఒమన్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న సుల్తాన్ ఖబూస్ బిన్.. చికిత్స కోసం 2019 డిసెంబరులో బెల్జియం వెళ్లారు. అక్కడ వారం రోజులపాటు చికిత్స తీసుకున్నారు. ఖబూస్ అవివాహితుడు కావడం, సోదరులెవరూ లేకపోవడంతో ఆయన వారసుడు ఎవరన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఒమన్ రాజ్యాంగం ప్రకారం సుల్తాన్ పదవి ఖాళీ అయిన మూడు రోజుల్లోగా రాజ కుటుంబం సూచించిన వ్యక్తి సింహాసనాన్ని అధిష్ఠించాలి. లేనిపక్షంలో రాజకుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఖబూస్ రాసిన లేఖలో పేర్కొన్న వ్యక్తిని సుల్తాన్‌గా నియమిస్తారు. ఒమనీ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించి, రాజకుటుంబానికి చెంది, తగిన అర్హతలున్న వ్యక్తిని తదుపరి సుల్తాన్‌గా ఎన్నుకుంటారు. ఇదిలా ఉండగా, రాజకుటుంబం కొత్త పాలకుడిని సూచించాలని మిలటరీ అత్యున్నత కౌన్సిల్ శనివారం కోరింది. ఈ విషయంలో రాజకుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే.. మిలటరీ, భద్రతా అధికారులు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పార్లమెంటు ఉభయసభల నాయకులు సంయుక్తంగా చర్చించి సుల్తాన్ రహస్యంగా సూచించిన వ్యక్తిని కొత్త పాలకుడిగా నియమిస్తారు. ఈ నిబంధనల ప్రకారం దాదాపు 80 మంది పోటీలో ఉన్నట్లు సమాచారం. వీరిలో అసద్ బిన్ తారిఖ్ పేరుగా గట్టిగా వినిపిస్తోంది. 65ఏళ్ల తారిఖ్ 2017లో ఉపప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సుల్తాన్ ఖబూస్ బంధువులైన అసద్, షిహాబ్, హియతమ్ బిన్ తారిఖ్, అల్ సయిద్‌లలో ఎవరినో ఒకరిని సుల్తాన్‌గా నియమించనున్నారు. కొత్త పాలకులకు దేశంలో ఆర్థిక పరిస్థితుల నుంచి పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని పరిష్కరించడం సవాళ్లుగా నిలుస్తుందని అంటున్నారు.
By January 11, 2020 at 10:18AM
No comments