దారుణం.. తండ్రికి తలకొరివి పెట్టాలంటే రూ.లక్ష ఇవ్వాలన్న కొడుకు
కని పెంచిన తల్లిదండ్రులనే పట్టించుకోని పిల్లలు, చివరకు వారు చనిపోయిన తర్వాత కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ముందుకురాని ఉదంతాలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా, ఓ కుమారుడు తన తండ్రికి తలకొరివి పెట్టాలంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఉదంతం ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రక్ జిల్లా బజరాపూర్‌కు చెందిన అనామచరణ్ బందు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఆయనకు ఓ కుమారుడు ఉండగా, అనారోగ్యంతో భార్య కన్నుమూసింది. భార్య మృతి చెందిన తర్వాత కుమారుడు, కోడలు ఆయనను వేధింపులకు గురిచేయడంతో స్నేహితుడి ఇంటికి చేరాడు. గత 17 ఏళ్లుగా స్నేహితుడు గజేంద్ర సాహు ఇంట్లో ఆయన కాలం వెళ్లదీస్తున్నాడు. వయసు పైబడటంతో కొద్ది రోజుల కింద అనారోగ్యానికి గురయిన బందు గురించి కుమారుడికి సమాచారం ఇచ్చినా అతడు స్పందించలేదు. ఈక్రమంలో ఆరోగ్యం విషమించడంతో అనామచరణ్ బుధవారం రాత్రి మృతి చెందారు. దీని గురించి ఆయన కుమారుడికి గజేంద్ర సాహు చెప్పి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. అయితే, దీనికి అతడు నిరాకరించడమే కాదు, తనకు డబ్బులివ్వాలని కోరాడు. అంతేకాదు, గత 17 ఏళ్లుగా మా నాన్న పెన్షన్ తీసుకుంటున్నారు... రూ.లక్ష ఇస్తేనే తలకొరివి పెడతానని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులకు గజేంద్ర సాహు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో అనామచరణ్ కుమారుడిని పిలిపించిన పోలీసులు.. అతడితో చర్చించి తండ్రి అంత్యక్రియలు జరిపించడానికి ఒప్పించారు. పోలీసుల జోక్యంతో చివరకు తండ్రికి తలకొరివి పెట్టాడు.
By January 11, 2020 at 09:21AM
No comments