పది ఇరవై కాదు ఏకంగా 134 శాతం పెరిగిన బీజేపీ ఆదాయం!
గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, ఖర్చులు వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు భారతీయ జనతా పార్టీ సమర్పించింది. ఆ పార్టీ సమర్పించిన అఫిడ్‌విట్ ప్రకారం ఆదాయం 134 శాతం పెరిగింది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రూ.2,410 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. ఇది 2017-18 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,027 కోట్లుగా ఉంది. బీజేపీకి గత ఆర్ధిక సంవత్సరంలో సమకూరిన మొత్తం ఆదాయంలో రూ.1,450 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా వచ్చినట్టు పేర్కొంది. ఇదే 2017-18లో మాత్రం రూ.210 కోట్లు మాత్రమే ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా వచ్చింది. అలాగే, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,005 కోట్లు ఖర్చుచేసినట్టు తెలియజేసింది. ఈ ఖర్చులు 2017-18తో పోలిస్తే 32 శాతం అధికం. 2017-18లో రూ.758 కోట్లు, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.792 కోట్లు. ఈ మొత్తాన్ని ఎన్నికలు, సాధారణ ప్రచారం కోసం వినియోగించినట్టు వివరించింది. ప్రధాన ప్రతిపక్షం పార్టీ ఆదాయం కేవలం రూ.918 కోట్లు అయితే, 2017-18తో పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం కావడం విశేషం. 2017-18లో ఇది రూ.199 కోట్లు కాగా, 2018- 19లో రూ.918 కోట్లు. ఖర్చులు రూ.470 కోట్లుగా తెలిపింది. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా 2017-18లో కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఆ పార్టీకి విరాళంగా రాగా, 2018-19లో ఇది రూ.383 కోట్లుగా ఉంది. గడిచిన ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆదాయం గణనీయంగా పడిపోయినా, సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం భారీగా ఖర్చుచేసింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, సిక్కిమ్ అసెంబ్లీల ఎన్నికల్లో మొత్తం రూ.820 కోట్లు ఖర్చుచేసినట్టు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదికలో కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం రూ.516 కోట్లను ఖర్చుచేయగా, ఈ సారి దాదాపు రూ.300 కోట్లు ఖర్చుచేసింది. పార్టీ ఎన్నికల ప్రచారానికి రూ.626.3 కోట్లు, అభ్యర్థుల కోసం రూ.193.9 కోట్లు ఖర్చుచేసినట్టు తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడి ప్రక్రియ పూర్తయినంత వరకు మొత్తం రూ.856 కోట్లు ఖర్చయ్యింది. ఎన్నికల ప్రచారానికి చేసిన రూ.626 కోట్లలో రూ.573 కోట్లు చెక్కు రూపంలోనూ, రూ.14.33 నగదు రూపంలో చెల్లించింది. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు మీడియా ప్రచారం, ప్రకటనల కోసం రూ.356 కోట్లు ఖర్చయ్యాయి. పోస్టర్స్, ఎన్నికల ప్రచార సామాగ్రి కోసం రూ.47 కోట్లు, స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారానికి రూ.85.82 కోట్లు ఖర్చయినట్టు వివరించింది.
By January 10, 2020 at 09:32AM
No comments